Gautam Gambhir: డ్రెస్సింగ్ రూమ్ చర్చలు బయటకు రావొద్దు - గంభీర్ వార్నింగ్ - ఐదో టెస్ట్ నుంచి రోహిత్ ఔట్!
Gautam Gambhir: బాక్సింగ్ డే టెస్ట్ ఓటమి నేపథ్యంలో కోచ్ గంభీర్‌కు కెప్టెన్ రోహిత్ శర్మకు మధ్య విభేదాలు మొదలైనట్లు పుకార్లు వినిపిస్తోన్నాయి. బాక్సింగ్ టెస్ట్ ఓటమిపై ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ గట్టిగా క్లాస్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై గంభీర్ ఏమన్నాడంటే?
Gautam Gambhir: బాక్సింగ్ డే టెస్ట్‌లో ఓటమితో టీమిండియా ఆటగాళ్లపై విమర్శలు పెరిగిపోయాయి. గెలిచే మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో ఓటమి పాలయ్యారు. డ్రా ముంగిట 34 పరుగులు వ్యవధిలోనే చివరి ఏడు వికెట్లు కోల్పోయి టీమిండియా ఓటమిని కొని తెచ్చుకున్నది. ఈ ఓటమి నేపథ్యంలో కోచ్ గంభీర్‌కు కెప్టెన్ రోహిత్ శర్మకు మధ్య విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. సెలెక్షన్ కమిటీపై గంభీర్ కోపంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
గంభీర్ క్లాస్...
బాక్సింగ్ డే టెస్ట్‌లో ఓటమి అనంతరం టీమిండియా క్రికెటర్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ గట్టిగా క్లాస్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆటగాళ్లకు కోచ్‌కు మధ్య వాదనలు గట్టిగానే జరిగినట్లు సమాచారం. ఈ పుకార్లపై గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఐదు టెస్ట్ ముంగిట ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ డ్రెస్సింగ్ రూమ్ మీటింగ్స్‌కు సంబంధించి వస్తోన్న పుకార్లలో ఏ మాత్రం నిజం లేదని అన్నాడు.
టీమ్ గురించే...
డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ గురించే చర్చలు జరుగుతుంటాయని గంభీర్ అన్నాడు. వ్యక్తిగతంగా ఒక్కరిని ఉద్దేశించి కాకుండా టీమ్‌ను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుకుంటాం.గెలుపు, ఓటమిలకు ఆటగాళ్లు అందరి సమిష్టిగా బాధ్యత వహించాల్సిందే. క్రికెటర్ల ఆటతీరు, వారి బలహీనతలు, చేస్తోన్న తప్పులపైనే నిజాయితీగా డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చలు జరుపుతుంటాం. డ్రెస్సింగ్ రూమ్ చర్చలు అక్కడి వరకే ఉండాలి. అవి ఎప్పటికీ బయటకు రాకూడదు అని గంభీర్ ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నాడు.
నిజాయితీ గల వ్యక్తులు...
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలు గంభీర్ ఖండించాడు. గెలవాలంటే ఏం చేయాలి? ఎప్పుడు ఎలా ఆడాలన్నది జట్టులోని ప్రతి ఆటగాడికి తెలుసు. నిజాయితీగల వ్యక్తులు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నంత వరకు భారత క్రికెట్ ఎప్పటికీ భద్రంగానే ఉంటుందని గంభీర్ అన్నాడు.
రోహిత్ శర్మ ఉంటాడా?
పేలవ ప్రదర్శన కారణంగా ఐదు టెస్ట్ నుంచి రోహిత్ శర్మను తప్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై గంభీర్‌ను ప్రశ్నించగా...మ్యాచ్ మొదలయ్యే ముందే తుది జట్టును ప్రకటిస్తామని అన్నాడు. రోహిత్‌తో పాటు జట్టులోని ఏ ఆటగాడితో సమస్యలు లేవని కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.