టీమిండియా క్రికెటర్లా మజాకా? నేషనల్ టీమ్ కు గుడ్ బై చెప్పినా కూడా వాళ్ల సంపాదన మాత్రం కోట్లలోనే ఉంటోంది. తాజాగా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఏకంగా రూ.69 కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్నాడన్న వార్త వైరల్ అవుతోంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ పూర్తయినా.. ఆ వార్త తాజాగా బయటకు వచ్చింది. ఆ అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్ విశేషాలేంటో చూద్దాం.
ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్.. దానికి దగ్గర్లోని గురుగ్రామ్ లేదా గుర్గావ్ లో ఈ కొత్త అపార్ట్‌మెంట్ కొన్నాడు. డీఎల్ఎఫ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయిన ది దహ్లియాస్ లో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. మొత్తంగా రిజిస్ట్రేషన్ తో కలిపి రూ.69 కోట్లు కావడం విశేషం. ఈ అపార్ట్‌మెంట్ ధర రూ.65.61 కోట్లు కాగా.. మిగిలిన మొత్తం స్టాంప్ డ్యూటీకి ఖర్చయినట్లు డాక్యుమెంట్లు వెల్లడించాయి. స్టాంప్ డ్యూటీయే రూ.3.24 కోట్లు. గుర్గావ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్ సెక్టార్ 54లో ఈ డీఎల్ఎఫ్ ది దహ్లియాస్ బిల్డింగ్ ఉంది. ఫిబ్రవరి 4నే రిజిస్ట్రేషన్ పూర్తయింది.
అభిమానులు గబ్బర్ అని ముద్దుగా పిలుచుకునే శిఖర్ ధావన్ కొనుగోలు చేసిన ఈ అపార్ట్‌మెంట్ 6040 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఐదు కారు పార్కింగ్ స్పాట్స్ కూడా ఇందులో భాగంగా కేటాయించారు. ఒక్కో చదరపు అడుగుకు అతడు రూ.1.08 లక్షలు ఖర్చు చేయడం విశేషం.
శిఖర్ ధావన్ 2010లో టీమిండియాకు తొలిసారి ఆడాడు. ఇక 2013లో ఆస్ట్రేలియాపై ఆడిన తొలి టెస్టులోనే సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 12 ఏళ్ల పాటు ఇండియన్ టీమ్ తరఫున అతడు ఆడాడు. చివరిగా 2022లో బంగ్లాదేశ్ పై చివరి వన్డే మ్యాచ్ లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.
34 టెస్టుల్లో 2315 పరుగులు, 167 వన్డేల్లో 6793 పరుగులు, 68 టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 24 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది ఆగస్ట్ లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
సంబంధిత కథనం