Team India: మిమ్మల్ని బాగా చూసుకుంటాం.. పాకిస్థాన్‌కు రండి: టీమిండియాకు పాక్ మాజీ క్రికెటర్ రిక్వెస్ట్
Team India: టీమిండియాకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఓ రిక్వెస్ట్ పంపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చే ఏడాది పాకిస్థాన్ కు రావాలని, బాగా చూసుకుంటామని అతడు చెప్పడం గమనార్హం.
Team India: పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్తుందా లేదా? వచ్చే ఏడాది ఆ దేశంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రశ్న ఇప్పటికీ అందరినీ వేధిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ, భారత ప్రభుత్వానికి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఓ స్పెషల్ రిక్వెస్ట్ పంపించాడు. టీమిండియాను పాకిస్థాన్ కు పంపించాలని, వాళ్లను బాగా చూసుకుంటామని చెప్పాడు.
చాలా బాగా చూసుకుంటారు: వసీం అక్రమ్
ఛాంపియన్స్ ట్రోఫీకి ఈసారి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే ఆ దేశంతో ఎలాంటి క్రికెట్ సంబంధాలు వద్దని నిర్ణయించుకున్న బీసీసీఐ.. చాలా ఏళ్లుగా దాయాది దేశానికి టీమ్ ను పంపించలేదు. ఈసారి కూడా వెళ్తుందా లేదా అన్నదానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్ క్రికిన్ఫోతో వసీం అక్రమ్ మాట్లాడాడు. "నాకు తెలిసినంత వరకు భారత ప్రభుత్వం, బీసీసీఐ నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. వాళ్ల మ్యాచ్ లన్నీ లాహోర్ లోనే ఆడాలని అనుకుంటున్నట్లు ఎక్కడో చదివాను. వాళ్లు లాహోర్ వచ్చి మళ్లీ రాత్రి తిరిగి వెళ్లిపోవాలని భావిస్తున్నట్లున్నారు.
ఇండియా అది సౌకర్యవంతంగా భావించినంత వరకు నాకు అది సమ్మతమే. అంతేకాదు వాళ్లను బాగా చూసుకుంటామని కూడా నేను మాట ఇస్తున్నాను. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్లకు పాకిస్థాన్ లో అభిమానులు ఉన్నారు. ఇక్కడి యువ క్రికెట్ అభిమానులు వాళ్లను ఆరాధిస్తారు" అని అక్రమ్ అన్నాడు.
టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్తుందా?
సుమారు 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. చివరిసారి 2017లో ఇండియాను ఫైనల్లో ఓడించి కప్పు గెలిచిన పాకిస్థానే ఆతిథ్యమిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మొత్తంగా 15 మ్యాచ్ లు వేదికలను కూడా ఇప్పటికే ఐసీసీ అనౌన్స్ చేసింది.
అయితే ఇండియా ఆడుతుందా లేదా అన్నదానిపైనే స్పష్టత లేదు. 2008 నుంచి పాకిస్థాన్ గడ్డపై టీమిండియా అడుగుపెట్టలేదు. భారత ప్రభుత్వం అనుమతిస్తేనే ఇప్పుడు కూడా పాకిస్థాన్ వెళ్తుంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక మాత్రం మారదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెబుతోంది. మరి దీనిపై తుది నిర్ణయం ఎప్పుడు వస్తుందన్నది వేచి చూడాలి.