Shikhar Dhawan: ఐసీసీ టోర్నమెంట్‌లో క్రికెట్ ప్రపంచానికి చెమటలు పట్టించిన గబ్బర్, మిస్టర్ ఐసీసీగా కితాబులు
ఐసీసీ టోర్నమెంట్‌లో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని, ఒత్తిడిని అధిగమిస్తూ పరుగులు చేయాలంటే అగ్రశ్రేణి బ్యాటర్లకి కూడా అంత సులువు కాదు. కానీ.. శిఖర్ ధావన్ మాత్రం చాలా అలవోకగా ఐసీసీ టోర్నమెంట్‌లలో పరుగుల వరద పారించేశాడు.
Shikhar Dhawan Records: వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ తదితర ఐసీసీ టోర్నీలంటే సాధారణంగా చాలా మంది క్రికెటర్లు ఒత్తిడికి గురవుతుంటారు. ద్వైపాక్షిక, ముక్కోణపు సిరీస్‌లతో పోలిస్తే, ప్రపంచ స్థాయి జట్లన్నీ పోటీపడే ఐసీసీ టోర్నమెంట్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం అగ్రశ్రేణి ఆటగాళ్లకి సైతం అంత సులువు కాదు. కానీ భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం ఐసీసీ టోర్నీలంటే బ్యాట్‌తో చెలరేగిపోయేవాడు. వరుస శతకాలు బాదేస్తూ ప్రపంచ స్థాయి బౌలర్లకీ చుక్కలు చూపించేసేవాడు.
అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కి ఈరోజు ఉదయం రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్.. దశాబ్దానికిపైగా సాగిన కెరీర్‌కి ముగింపు పలికాడు. దాదాపు రెండేళ్ల నుంచి భారత్ సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం ఎదురుచూసిన శిఖర్ ధావన్ వీడ్కోలు మ్యాచ్ కూడా లేకుండానే గుడ్ బై చెప్పేశాడు. 38 ఏళ్ల గబ్బర్ చివరిసారిగా భారత్ తరఫున 2022లో బంగ్లాదేశ్‌పై వన్డేలో ఆడాడు.
‘‘నా క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగించేటప్పుడు లెక్కలేనన్ని జ్ఞాపకాలు, కృతజ్ఞతలను నాతో తీసుకెళ్తున్నాను. మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. జైహింద్!’’ అని 'ఎక్స్'లో శిఖర్ ధావన్ రాసుకొచ్చాడు.
వన్డేల్లో తిరుగులేని బ్యాటర్
సుదీర్ఘ కెరీర్‌లో భారత్ తరఫున మొత్తం 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధావన్.. వన్డేల్లో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో 44.11 సగటుతో 6793 పరుగులు చేశాడు. టీ20లు, టెస్టుల్లో అప్పుడప్పుడు ధావన్ నిరాశపరిచినా.. వన్డేల్లో మాత్రం నిలకడగా రాణించాడు.
భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో కలిసి బలమైన టాప్-3గా బ్యాటింగ్ ఆర్డర్‌ను శిఖర్ ధావన్ సెట్ చేశాడు. ఈ ముగ్గురూ 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రత్యర్థి జట్లపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించి భారత్‌ను విజేతగా నిలిపారు. ఇక అప్పటి నుంచి శిఖర్ ధావన్ కొన్నేళ్ల పాటు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.
'మిస్టర్ ఐసీసీ’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ధావన్ ఐసీసీ టోర్నీల్లో అసాధారణ రికార్డులు నెలకొల్పాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్ ఐదు ఇన్నింగ్స్‌లో 363 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2015 ప్రపంచకప్‌లో 8 ఇన్నింగ్స్‌లో 412 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
గాయంతోనే ఆస్ట్రేలియాపై సెంచరీ
2019 వన్డే వరల్డ్‌కప్‌లోనూ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగే వరకూ అతని జోరు కొనసాగింది. ఆ మెగా టోర్నీలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన గబ్బర్ రెండో మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు సాధించాడు. చివరికి ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో వేలికి తీవ్ర గాయమైనా నొప్పిని పంటి బిగువన భరిస్తూ 117 పరుగులు చేశాడు. ఐసీసీ టోర్నీల్లో శిఖర్ ధావన్ దూకుడుకి కళ్లెం వేయలేక ప్రత్యర్థి జట్లు అతడ్ని ఔట్ చేయలేక తలలు పట్టుకునేవి. పవర్ ప్లే నుంచే బాదుడు మొదలెట్టే శిఖర్ ధావన్.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా గేర్లు మార్చుకుంటూ వెళ్లేవాడు. దాంతో ప్రత్యర్థి బౌలర్లకీ చిక్కులు తప్పేవి కావు. దాదాపు ఆరేళ్ల పాటు ఐసీసీ టోర్నీల్లో గబ్బర్ హవా కొనసాగింది.
2022 చివర్లో యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ రూపంలో యంగ్ ఓపెనర్ల రాకతో శిఖర్ ధావన్‌కి కష్టాలు మొదలయ్యాయి. ఫామ్ కోల్పోవడం, ఫిట్‌నెస్ అతని కెరీర్‌ను దెబ్బతీసింది. దాంతో భారత్ జట్టు నుంచి అతనికి పిలుపు కరువైంది. గత రెండేళ్లుగా భారత సెలెక్టర్ల పిలుపు కోసం అతను ఎదురుచూసి చివరికి నిరాశగానే గుడ్ బై చెప్పేశాడు.