ఆర్సీబీ రాత మార్చిన ఆ అయిదుగురు.. విక్టరీలో కీలక పాత్ర.. ఎవరంటే?-five key persons changed rcb fortunes to lift first ipl trophy virat kohli rajat patidar andy flower hazlewood krunal ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఆర్సీబీ రాత మార్చిన ఆ అయిదుగురు.. విక్టరీలో కీలక పాత్ర.. ఎవరంటే?

ఆర్సీబీ రాత మార్చిన ఆ అయిదుగురు.. విక్టరీలో కీలక పాత్ర.. ఎవరంటే?

ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు ఎండ్ కార్డు పడింది. ఆ టీమ్ కల నెరవేరింది. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో తొలిసారి ఆర్సీబీ విజేతగా నిలిచింది. అయితే ఈ విజయం వెనుక అయిదుగురి హస్తం ఉంది. టీమ్ విక్టరీలో వీళ్లు కీలక పాత్ర పోషించారు.

ఐపీఎల్ ట్రోఫీతో ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ (PTI)

ఆర్సీబీ అదరగొట్టింది. కల నిజం చేసుకుంది. 18 ఏళ్లుగా ఊరిస్తున్న విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ లో తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి, ట్రోఫీని ముద్దాడింది. ఆర్సీబీ విజయంతో ఆ టీమ్, ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ప్రేమికులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్సీబీ ఈ సీజన్ లో ఛాంపియన్ గా నిలవడం వెనుక ప్రధానంగా అయిదుగురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. వాళ్లెవరో చూద్దాం.

  • ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లి. విరాట్ కోహ్లి అంటేనే ఆర్సీబీ. 2008లో ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ ఇదే ఫ్రాంఛైజీకి ఆడుతున్నాడు. మరో టీమ్ కు ఆడే ఆలోచన కూడా లేదని విరాట్ చాలాసార్లు చెప్పాడు. ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ కప్ గెలవడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్ ల్లో 657 పరుగులు సాధించాడు. 8 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. సీనియర్ బ్యాటర్ గా తాను రాణించి టీమ్ లో స్ఫూర్తి నింపాడు. గ్రౌండ్ లో అగ్రెసివ్ అప్రోచ్ తో టీమ్ లో విజయ కాంక్ష కొనసాగేలా చూశాడు.
  • ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సీజన్ కు ముందు ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్న డుప్లెసిస్ ను టీమ్ వదిలేసింది. దీంతో మళ్లీ కోహ్లికి పగ్గాలు ఇస్తారేమో అనిపించింది. కానీ అందుకు విరాట్ సిద్ధంగా లేకపోవడంతో అనూహ్యం రజత్ పటీదార్ కు కెప్టెన్సీ దక్కింది. ఈ అవకాశాన్ని అతను గొప్పగా సద్వినియోగం చేసుకున్నాడు. నాయకత్వ లక్షణాలతో ఆకట్టుకున్నాడు. మహామహా దిగ్గజాలకు సాధ్యం కాని ట్రోఫీని ఆర్సీబీకి అందించాడు. బ్యాటర్ గానూ రజత్ (312 పరుగులు) రాణించాడు.
  • పేసర్ జోష్ హేజిల్ వుడ్ కు ఆర్సీబీ విజయపు ఘనత దక్కాల్సిందే. ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. 12 ఇన్నింగ్స్ ల్లో 22 వికెట్లు తీశాడు. మధ్యలో లీగ్ కు బ్రేక్ రావడంతో స్వదేశం వెళ్లిపోయిన హేజిల్ వుడ్.. ఆర్సీబీ కోసం మళ్లీ తిరిగి వచ్చాడు. క్వాలిఫయర్ 1, ఫైనల్లో బౌలింగ్ తో సత్తాచాటాడు.
  • ఐపీఎల్ మెగా వేలంలో కృనాల్ పాండ్య‌ కోసం రూ.5.75 కోట్లు ఖర్చు చేసింది ఆర్సీబీ. అసలు పెద్దగా ఫామ్ లో లేని కృనాల్ కోసం అంత అవసరమా? అనే విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఫైనల్లో అతనే అద్భుత బౌలింగ్ తో జట్టును గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. సీజన్ సాంతం అతను నిలకడ కొనసాగించాడు. 17 వికెట్లు తీయడంతో పాటు 109 పరుగులు చేశాడు.
  • చివరగా చెప్పుకోవాల్సింది అత్యంత కీలకమైన వ్యక్తి గురించే. అతనే ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్. కోచ్ గా ఫ్లవర్ కెరీర్ గొప్పగా ఉంది. పాకిస్థాన్ సూపర్ లీగ్, హండ్రెడ్, ఐఎల్ టీ20 లీగ్ ల్లో తను కోచ్ గా ఉన్న జట్లను ఛాంపియన్లుగా నిలిపాడు ఫ్లవర్. ఐపీఎల్ లో లక్నో కోచ్ గా ఆ టీమ్ ను ప్లేఆఫ్స్ కు తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆర్సీబీకి టైటిల్ సాధించిపెట్టాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం