ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో తొడ కండరాల గాయంతో ఐడెన్ మార్క్రమ్ అద్భుత సెంచరీ, తెంబా బవుమా వీరోచిత హాఫ్ సెంచరీపై క్రికెట్ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తోంది. కానీ ఒక వర్గం అభిమానులు మాత్రం పాక్ క్రికెట్ జట్టుపై విరుచుకుడుతున్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను అవమానించినందుకు పాక్ ఆటగాళ్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడని పాక్ కు ఇందులో ఎలాంటి పాత్ర లేదు. టెంబా బవుమా, ఐడెన్ మార్క్రమ్ లు మూడో వికెట్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి దక్షిణాఫ్రికాను తొలి డబ్ల్యూటీసీ టైటిల్ కు చేరువ చేసిన తర్వాత పాక్ క్రికెట్ జట్టు ఎందుకు టార్గెట్ గా మారింది? దీనికి సమాధానం ఈ ఏడాది ఫిబ్రవరిలో కరాచీలో జరిగిన మ్యాచ్ లో ఉంది.
పాకిస్థాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు సిరీస్ చివరి లీగ్ మ్యాచ్లో బవుమా రనౌట్ కావడంతో అతని పట్ల పాక్ క్రికెటర్లు అవమానకరంగా వ్యవహరించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 29వ ఓవర్లో 82 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన బవుమా ఒక బంతిని ఆఫ్ సైడ్ వైపు నెట్టి వేగంగా సింగిల్ కు ప్రయత్నించాడు. మాథ్యూ బ్రీట్జ్కే ఈ పిలుపునకు స్పందించినప్పటికీ చివరి క్షణంలో వెనక్కి వెళ్లడంతో బవుమా పిచ్ మధ్యలో ఆగి, మళ్లీ వెనక్కి రావాల్సి వచ్చింది. ఈ లోపే సౌద్ షకీల్ డైరెక్ట్ త్రోతో బవుమా రనౌట్ అయ్యాడు.
బవుమా రనౌట్ తో పాకిస్థాన్ ఆటగాళ్లు హద్దు మీరి ప్రవర్తించారు. షకీల్, సల్మాన్ ఆఘాతో కలిసి కమ్రాన్ గులాం బవుమా ముందు మితిమీరి సంబరాలు చేసుకున్నాడు. బవుమా దారికి అడ్డంగా వచ్చారు. అంపైర్లు వెంటనే పాక్ కెప్టెన్ రిజ్వాన్ ను ఈ విషయంపై హెచ్చరించారు కూడా. ఇప్పుడు ఆ మ్యాచ్ వీడియో తెగ వైరల్ గా మారింది. దక్షిణాఫ్రికాకు డబ్ల్యూటీసీ టైటిల్ అందించిన బవుమా లాంటి లీడర్ ను ఇలా అవమానిస్తారా? అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పాక్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
డబ్ల్యూటీసీ 2025 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా సూపర్ విక్టరీ సాధించింది. నాలుగో ఇన్నింగ్స్ లో మార్ క్రమ్, బవుమా కలిసి 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి దక్షిణాఫ్రికాను చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించారు. బవుమా ఫైటింగ్ ఫిఫ్టీ సాధించగా.. మార్ క్రమ్ అద్భుతమైన సెంచరీతో టీమ్ ను గెలిపించాడు. 27 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా మరో ఐసీసీ టైటిల్ దక్కించుకుంది. చివరగా 1998లో ఆ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది.
సంబంధిత కథనం