Rohit Sharma Trolling: బాబూ.. నీకో దండం.. ఇక రిటైరైపో.. రెండే పరుగులు చేసిన రోహిత్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
Rohit Sharma Trolling: రోహిత్ శర్మను మరోసారి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. ఇక చాలు రిటైరైపో అంటూ సూచిస్తున్నారు. ఇంగ్లండ్ తో తొలి వన్డేలో అతడు కేవలం 2 పరుగులకే ఔటవడంతో సహనం కోల్పోయిన ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో రోహిత్ పై మండిపడుతున్నారు.

Rohit Sharma Trolling: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. తనకు ఎంతో కలిసి వచ్చిన వన్డే ఫార్మాట్లో అయినా అతడు తిరిగి ఫామ్ లోకి వస్తాడని అనుకున్నా.. ఇంగ్లండ్ తో తొలి వన్డేలో 7 బంతుల్లో రెండే పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఇక రిటైరైపో అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
రోహిత్.. రిటైరైపో..
రోహిత్ శర్మ కొన్నాళ్లుగా కెప్టెన్ గా, బ్యాటర్ గా విఫలమవుతూనే ఉన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ విఫలమయ్యాడు. ఇప్పుడు వన్డేల్లో అయినా గాడిలో పడతాడని అనుకుంటే.. తొలి మ్యాచ్ లో కేవలం రెండే పరుగులు చేసి నిరాశ పరిచాడు. దీంతో సహనం కోల్పోయిన అభిమానులు.. రోహిత్ పై ట్రోలింగ్ కు దిగారు. “రోహిత్ శర్మ ఇప్పుడు టీమ్ కు నువ్వో భారం.. దయచేసి రిటైరైపో బ్రో.. ఎంతో మంది యువ ప్లేయర్స్ అవకాశాలను నువ్వు లాగేసుకుంటున్నావ్” అంటూ ఓ అభిమాని మండిపడ్డాడు.
రిటైర్ అనే పదం కూడా రిటైరవుతుందేమో కానీ రోహిత్ శర్మ మాత్రం రిటైరవడు అంటూ మరో అభిమాని సెటైర్ వేశాడు. రోహిత్ శర్మను ఔట్ చేయడానికి ఎలాంటి బాల్ వేయాలి.. ఓ లీగల్ బాల్ అయితే చాలు అని మరో ఫ్యాన్ దారుణంగా ట్రోల్ చేశాడు. ఇలా టీమిండియా కెప్టెన్ పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివ్ కామెంట్స్, పోస్టులు వస్తున్నాయి.
రోహిత్ శర్మ చెత్త ఫామ్
రోహిత్ శర్మ ఫార్మాట్ తో సంబంధం లేకుండా విఫలమవుతూనే ఉన్నాడు. తాజాగా నాగ్‌పూర్ లో ఇంగ్లండ్ తో తొలి వన్డేలోనూ అదే కొనసాగింది. గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్న రోహిత్.. వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఈ రెండు ఫార్మాట్లు కలిపి అతడు గత 16 ఇన్నింగ్స్ లో కేవలం 166 రన్స్ చేశాడు. సగటు కేవలం 10.37 మాత్రమే.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో తొలి టెస్టుకు దూరమై.. తర్వాత మూడు టెస్టుల్లో విఫలమవడంతో చివరి టెస్టు ఆడలేదు. అప్పుడే ఇక రోహిత్ రిటైరవుతాడన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అతడు తీవ్రంగా స్పందించాడు. ఏసీ రూమ్ లో ల్యాప్‌టాప్ పట్టుకొని కూర్చునే వ్యక్తి తమకు ఏం చేయాలో చెప్పాల్సిన అవసరం లేదంటూ మీడియాపై మండిపడ్డాడు.
ఇంగ్లండ్ తో తొలి వన్డేకు ముందు కూడా మీడియాతో కాస్త అసహనంగానే మాట్లాడాడు. ఇప్పుడు తొలి వన్డేలో వైఫల్యంతో అతనిపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తనున్నాయి. మరి వీటి నుంచి అతడు ఎలా గట్టెక్కుతాడో చూడాలి.
సంబంధిత కథనం