ఇంగ్లండ్ టీమ్ సిగ్గు పడాలి.. బజ్‌బాల్ కాదు కామన్ సెన్స్ వాడండి: మాజీ క్రికెటర్ ఘాటు కామెంట్స్-england should be embarrassed use common sense against india suggest former player geoffrey boycott ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఇంగ్లండ్ టీమ్ సిగ్గు పడాలి.. బజ్‌బాల్ కాదు కామన్ సెన్స్ వాడండి: మాజీ క్రికెటర్ ఘాటు కామెంట్స్

ఇంగ్లండ్ టీమ్ సిగ్గు పడాలి.. బజ్‌బాల్ కాదు కామన్ సెన్స్ వాడండి: మాజీ క్రికెటర్ ఘాటు కామెంట్స్

Hari Prasad S HT Telugu

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ తమ టీమ్ పై ఘాటు విమర్శలు చేశాడు. బజ్‌బాల్ ను పక్కన పెట్టి ఇండియాపై కామన్ సెన్స్ తో ఆడాలని అన్నాడు. ఒక్క డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడకపోవడం ఇంగ్లండ్ కు సిగ్గు చేటు అని అతడు స్పష్టం చేశాడు.

ఇంగ్లండ్ టీమ్ సిగ్గు పడాలి.. బజ్‌బాల్ కాదు కామన్ సెన్స్ వాడండి: మాజీ క్రికెటర్ ఘాటు కామెంట్స్ (AFP)

ఇంగ్లండ్ టీమ్ పై మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ తీవ్రంగా మండిపడ్డాడు. టీమిండియాతో కీలకమైన సిరీస్ కు ముందు తమ జట్టుపై ఘాటు కామెంట్స్ చేశాడు. బజ్‌బాల్ తర్వాత.. ముందు గెలుపే లక్ష్యంగా ఆడాలని సూచించాడు. శుక్రవారం (జూన్ 20) నుంచి ఇండియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

ఇంగ్లండ్‌.. కీలకమైన సిరీస్‌లు

ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ఈ ఏడాది భారీ టెస్ట్ క్రికెట్ సీజన్‌కు సిద్ధమవుతోంది. ముందుగా భారత్‌తో సొంతగడ్డపై తలపడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్‌కు వెళ్లనుంది. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్‌కల్లమ్ నాయకత్వంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పట్ల ఇంగ్లండ్ జట్టు పెద్దగా ఆసక్తి చూపకపోయినా, స్వదేశంలో అభిమానులు మాత్రం జట్టు 2027 డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలని ఆశిస్తున్నారు. గత మూడు సైకిళ్లలో ఫైనల్స్ ఇంగ్లండ్‌లోనే జరిగినా, ఆ జట్టు ఒక్కసారి కూడా అర్హత సాధించలేదు.

బజ్‌బాల్‌పై బాయ్‌కాట్ విమర్శలు

ఇంగ్లండ్ మాజీ ఆటగాడు సర్ జెఫ్రీ బాయ్‌కాట్ ఈ విషయంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఇంగ్లండ్ జట్టు ఆడే ‘బజ్‌బాల్’ శైలిని ‘నిర్లక్ష్యం’ అని విమర్శించాడు. దీని వల్ల జట్టు కొన్ని టెస్ట్ మ్యాచ్‌లను చేజార్చుకుందని, ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాలని అన్నాడు.

‘ది టెలిగ్రాఫ్’లో తన కాలమ్‌లో బాయ్‌కాట్ ఇలా రాశాడు. “బజ్‌బాల్‌ను కాస్త నియంత్రిస్తూ, కొంచెం కామన్ సెన్స్ తో ఆడితే ఇంగ్లండ్ భారత్‌ను ఓడించగలదు. వాళ్ల క్రికెట్ చూడటానికి థ్రిల్లింగ్‌గా, ఆనందంగా ఉంటుంది. కానీ నిరక్ష్యంతో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌లను కోల్పోతున్నారు”

“ఇంగ్లండ్ సిగ్గుపడాలి”

“గెలవడమే జట్టు లక్ష్యంగా ఉండాలి. గత మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ మన దేశంలో జరిగినా, ఇంగ్లండ్ ఒక్కసారి కూడా అర్హత సాధించలేదు. ఇది సిగ్గుచేటు. 2027 డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో ఆడాలి” అని బాయ్‌కాట్ గట్టిగా చెప్పాడు.

భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండేసి ఫైనల్స్‌కు చేరగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఒక్కోసారి టెస్ట్ మేస్‌ను గెలిచాయి. కానీ ఇంగ్లండ్ మాత్రం ఇప్పటివరకు ఒక్క ఫైనల్‌కు కూడా చేరలేదు. బజ్‌బాల్ శైలికి చాలామంది మద్దతు ఇస్తున్నా, గెలవడంపై దృష్టి పెట్టడం లేదనే నిరాశ అభిమానుల్లో ఉంది.

ఆకట్టుకోవడం కాదు గెలవాలి

“కొత్త సైకిల్ ఇప్పుడే మొదలైంది. ఆటగాళ్లకు ఒకటి స్పష్టం కావాలి.. ఆకట్టుకునే ఆటగాడవడం కంటే విజేతగా నిలవడం గొప్ప విషయం. గెలిచి, అదే సమయంలో ఆకట్టుకోగలిగితే అది బోనస్. ప్రస్తుతం ఇంగ్లండ్ ఒకే రకం ఆట ఆడుతోంది. అది బజ్‌బాల్. ఓటముల నుంచి నేర్చుకోవడం లేదు. మార్పును స్వీకరించడం లేదు” అని బాయ్‌కాట్ జట్టు ఏకపక్ష వైఖరిని తప్పుపట్టాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం