కొత్త నీరు రావాలంటే పాత నీరు వెళ్లిపోవాల్సిందే. క్రికెట జట్టులోనూ మార్పులు తప్పవు. ఏ ఆటగాడూ ఎల్లకాలం ఆడలేడు. కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్.. ఇలాంటి దిగ్గజాలందరూ రిటైర్మెంట్ తీసుకున్నవాళ్లే. ఇప్పుడు రోహిత్, కోహ్లి కూడా అదే లిస్ట్ లో చేరిపోయారు. రోకో (రోహిత్, కోహ్లి) అయిదు రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. మే7న రోహిత్, మే 12న కోహ్లి వీడ్కోలు పలికారు. అయితే ఒకేసారి ఈ ఇద్దరు స్టార్లు వెళ్లిపోవడం భారత టెస్టు క్రికెట్ ను కుదిపేసేదే.
సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్.. మరి వీళ్ల తర్వాత ఎవరూ అనుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, పుజారా, రహానె, ధోని వచ్చారు. భారత టెస్టు జట్టు బలం తగ్గకుండా చూసుకున్నారు. మరి ఇప్పుడు ఒకేసారి రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ టీమిండియాకు భారీ షాకే. ఇప్పుడీ ఇద్దరిని రీప్లేస్ చేసే ప్లేయర్లు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. మార్పు అనేది సాఫీగా సాగిపోతే ఏ ప్రాబ్లెం ఉండదు.. కానీ సంధి దశలో తడబడితే అది జట్టు అస్థిత్వానికే ప్రమాదకరంగా మారుతుంది. అందుకు శ్రీలంక, వెస్టిండీస్ జట్లే పెద్ద ఉదాహరణలు.
సుమారు దశాబ్దానికిపైగా రోహిత్, కోహ్లి టెస్టు జట్టులో కీలకంగా కొనసాగారు. కానీ సడెన్ గా ఇప్పుడు ఈ ఇద్దరు లేకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్లో ఖాళీ ఏర్పడుతుంది. దీన్ని భర్తీ చేయడమంటే సాధారణ విషయం కాదు. ఇప్పటికే టీమ్ లో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ ఉన్నారు. రోహిత్, కోహ్లి వీడ్కోలుతో భారత బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు జరిగే అవకాశముంది.
మరోవైపు సీనియర్లు పుజారా, రహానె కూడా ఆడపాదడపా రాణిస్తూ జట్టులో ఛాన్స్ కోసం చూస్తున్నారు. అయితే యంగ్ క్రికెటర్లకే బీసీసీఐ ప్రాధాన్యతనిచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ తో వచ్చే నెల 22న ఆరంభమయ్యే టెస్టు సిరీస్ లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు జరిగే అవకాశముంది.
రోహిత్ వీడ్కోలుతో ఓ ఓపెనర్ స్థానం ఖాళీ అయింది. మరో వైపు 19 టెస్టుల్లో 52.88 సగటుతో 1798 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా కొనసాగడం ఖాయం. ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ తిరిగి ఓపెనర్ గా ఆడొచ్చు. పుజారాపై వేటు తర్వాత గిల్ మూడో స్థానంలో ఆడుతున్నాడు. గత 15 నెలల్లో మూడు సెంచరీలు సాధించాడు. కానీ అవన్నీ స్వదేశంలో వచ్చినవే. విదేశాల్లో అయితే ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదు.
గతంలో రోహిత్ తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్ గా రాణించాడు. ఇంగ్లాండ్‌లో ఓపెనర్‌గా 34 సగటు నమోదు చేశాడు. రెండు సెంచరీలూ బాదాడు. ఈ నేపథ్యంలో గిల్ ను మూడో స్థానంలో నే ఉంచి, రాహుల్ ను ఓపెనర్ గా ఆడించొచ్చు. ఇక మరోవైప అభిమన్యు ఈశ్వరణ్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ యంగ్ ఓపెనర్ దేశవాళీల్లో సత్తాచాటుతున్నాడు.
మరోవైపు ఏ టోర్నీలో ఆడినా నిలకడతో అదరగొడుతున్న ఓపెనర్ సాయి సుదర్శన్ ఉన్నాడు. ఈ లెఫ్టార్మ్ బ్యాటర్ ప్రదర్శన గత కొంతకాలంగా అద్భుతంగా ఉంది. ఇంగ్లాండ్ కౌంటీల్లో సర్రేకు ఆడిన అనుభవం సుదర్శన్ కు ఉంది.
విరాట్ కోహ్లి ఖాళీ చేసిన నాలుగో నంబర్ స్థానాన్ని దక్కించుకోవడానికి శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్ పోటీపడే అవకాశముంది. దేశవాళీ టోర్నీల్లో కరుణ్ పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న శ్రేయస్ టెస్టుల్లోకి తిరిగి రావాలని చూస్తున్నాడు. అతణ్ని నంబర్ 4లో ఆడించే అవకాశాలను కొట్టిపారేయలేం. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ కూడా ఉన్నారు. ఇండియాకు రెండు టెస్టుల్లో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఆడిన పడిక్కల్ వరుసగా 25, 65 పరుగులు చేశాడు.
మొత్తానికి యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తో టీమిండియా టాప్-4 కొత్తగా రెడీ అయ్యేలా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
సంబంధిత కథనం