gambhir trolls: కేఎల్ రాహుల్ కెరీర్ తో ఆడుకోకు.. కోచ్ గంభీర్ పై దారుణమైన ట్రోల్స్.. ఫ్యాన్స్, మాజీ ఆటగాళ్ల ఫైర్
gambhir trolls: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. కేఎల్ రాహుల్ కెరీర్ తో ఆడుకోవద్దని గంభీర్ పై మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గంభీర్ పై ఫ్యాన్స్, మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కెరీర్ తో ఆడుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలెంటెడ్ క్రికెటర్ రాహుల్ ను డీమోట్ చేసేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఎక్స్ క్రికెటర్లు గంభీర్ ను టార్గెట్ చేసుకుని పోస్ట్ లు చేస్తున్నారు.
కేఎల్ రాహుల్ డౌన్
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ ను డౌన్ చేయడమే గంభీర్ పై ట్రోల్స్ కు కారణమైంది. అయిదో స్థానంలో కాదని ఆరో స్థానంలో రాహుల్ ను బ్యాటింగ్ కు పంపిస్తున్నారు. ఇప్పటివరకూ ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ అయిదో స్థానంలో అక్షర్ బ్యాటింగ్ చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన రాహుల్ విఫలమయ్యాడు. వరుసగా 2, 10 పరుగులు మాత్రమే చేశాడు.
కెరీర్ ఎండ్ చేస్తారా?
ఉద్దేశపూర్వకంగానే అతణ్ని బ్యాటింగ్ ఆర్డర్లో డౌన్ చేసి కెరీర్ ఎండ్ చేయాలని గంభీర్ చూస్తున్నాడని రాహుల్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. తనకు అలవాటు లేని స్థానంలో బ్యాటింగ్ కు పంపి ఫెయిల్ అవుతున్నాడనే పేరుతో జట్టు నుంచి రాహుల్ ను తప్పించే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు. దీంతో గంభీర్ ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఎక్స్ క్రికెటర్లు కూడా
మరోవైపు దొడ్డ గణేష్, క్రిష్ణమాచారి శ్రీకాంత్, జహీర్ ఖాన్ లాంటి టీమ్ఇండియా ఎక్స్ క్రికెటర్లు కూడా గంభీర్ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. అయిదో స్థానంలో రాహుల్ కు అద్భుతమైన రికార్డున్నా అతని పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని క్రిష్ణమాచారి అన్నాడు. గంభీర్ చేస్తుంది సరికాదన్నాడు.