Team India: అమితాబ్ సర్.. టీమిండియా ఆడే ఫైనల్ చూడొద్దు ప్లీజ్: బిగ్ బీని కోరుతున్న ఫ్యాన్స్.. ఇదీ కారణం
Team India: అమితాబ్ సర్.. టీమిండియా ఆడే ఫైనల్ చూడొద్దు ప్లీజ్ అని బిగ్ బీని అభిమానులు కోరుతున్నారు. వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి ఇండియా ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
Team India: మరో వరల్డ్ కప్ విజయానికి టీమిండియా అడుగు దూరంలో ఉన్న వేళ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు అభిమానులు ఓ వింత సందేశం పంపిస్తున్నారు. దయచేసి మీరు ఫైనల్ చూడొద్దని వాళ్లు సోషల్ మీడియా ద్వారా బిగ్ బీని కోరుతుండటం విశేషం. దీనికి కారణం కూడా అమితాబే. సెమీఫైనల్ ముగిసిన తర్వాత అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
సెమీస్ లో ఇండియా గెలిచిన తర్వాత బుధవారం (నవంబర్ 15) రాత్రి అమితాబ్ ఓ ట్వీట్ చేశాడు. "నేను చూడని సమయంలోనే మనం గెలుస్తాం" అన్నది బిగ్ బీ ట్వీట్ సారాంశం. ఇది చూసిన అభిమానులు.. అదే ట్విటర్ ద్వారా బాలీవుడ్ షెహన్ షాకి ఓ రిక్వెస్ట్ పంపించారు. దయచేసి మీరు ఫైనల్ చూడొద్దంటూ అతన్ని కోరడం విశేషం.
అలా అయితే ఆదివారం (నవంబర్ 19) సార్ ని బాత్రూమ్ లో వేసి టాక్ చేయాలి అని మరో అభిమాని సరదాగా కామెంట్ చేశాడు. మీ నాన్న మీద ఒట్టు.. ఫైనల్ మాత్రం చూడొద్దు అని ఇంకో అభిమాని బిగ్ ట్వీట్ పై స్పందించాడు. క్రికెటర్లకు కొన్ని నమ్మకాలు ఉన్నట్లే.. అమితాబ్ కి కూడా ఇలా తాను మ్యాచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుందన్న నమ్మకం బాగానే కుదరినట్లుంది.
నిజానికి ఈ సెమీఫైనల్ మ్యాచ్ చూడటానికి బిగ్ బీ కూడా వస్తాడని మొదట్లో వార్తలు వచ్చాయి. వరల్డ్ కప్ 2023లో ఎక్కడైనా ఏ మ్యాచ్ అయినా చూసే అవకాశం అమితాబ్ బచ్చన్ బీసీసీఐ కల్పించింది. టోర్నీ ప్రారంభానికి ముందే అతనికి గోల్డెన్ టికెట్ అందించింది. దీని ద్వారా ప్రతి స్టేడియంలో వీఐపీ బాక్స్ లో కూర్చొని మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. సచిన్ టెండూల్కర్, రజనీకాంత్ లకు కూడా బోర్డు ఈ టికెట్లు ఇచ్చింది.
రజనీకాంత్ ఈ సెమీస్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు. అతనితోపాటు సచిన్ టెండూల్కర్, మాధురీ దీక్షిత్, రణ్‌బీర్ కపూర్, సిద్ధార్థ్ కియారా దంపతులు, ముకేశ్ అంబానీ, ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ లాంటి వాళ్లు కూడా ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూశారు. ఈ మ్యాచ్ లో ఇండియా 70 పరుగులతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.