Dhoni New Car: లగ్జరీ మెర్సెడీస్ కారు కొన్న ధోనీ.. నంబర్ చూశారా?
Dhoni New Car: లగ్జరీ కార్లు, బైకులు ఇష్టపడే ఎమ్మెస్ ధోనీ తాజాగా మరో లగ్జరీ కారు కొన్నాడు. ఈసారి మెర్సెడీస్ జీ క్లాస్ కారులో ధోనీ వెళ్తున్న వీడియో, ఆ కారు నంబర్ వైరల్ అయ్యాయి.
Dhoni New Car: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తన రిటైర్మెంట్ లైఫ్ మొత్తం తనకెంతో ఇష్టమైన కార్లు, బైకులతోనే గడుపుతున్నాడు. ఆ మధ్య తన ఇంట్లో ఏకంగా ఓ షోరూమ్ లాగే ఉన్న వింటేజ్ కార్లు, బైకులను చూపించిన అతడు.. తాజాగా సరికొత్త లగ్జరీ కారు కొన్నాడు. ఈ మధ్యే అతడు మెర్సెడీస్ జీ క్లాస్ కారు కొనడం విశేషం.
ఈ కారు ప్రారంభ ధర ఇండియాలో రూ.2.55 కోట్లు కావడం విశేషం. ఇది ఎక్స్ షోరూమ్ ధరే. దీనికి ట్యాక్స్ లు అదనం. అన్నీ కలిపితే ప్రారంభ ధర సుమారు రూ.3 కోట్ల వరకూ ఉంటుంది. ధోనీ తన కొత్త కారులో వెళ్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో అతని కారు నంబర్ అభిమానులను ఆకర్షించింది. దీనికి తనకెంతో ఇష్టమైన నంబర్ అతడు దక్కించుకున్నాడు.
ధోనీ లక్కీ నంబర్, అతని జెర్సీ నంబర్ అయిన 7 కలిసొచ్చేలా కొత్త కారు నంబర్ తీసుకున్నాడు. ఈ కారుకు జేహెచ్ 01ఎఫ్‌బీ0007 అనే నంబర్ ధోనీ తీసుకున్నాడు. ఈ వీడియోను ధోనీ టెన్నిస్ పార్ట్‌నర్ సుమీత్ కుమార్ బజాజ్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. సోషల్ మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే ధోనీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇలాగే ఎవరో ఒకరు షేర్ చేస్తూ ఉంటారు.
ప్రస్తుతం ధోనీ తన సొంతూరు రాంచీలోనే ఉన్నాడు. ఇక అతడు వచ్చే ఏడాది ఐపీఎల్లో మరోసారి క్రికెట్ ఫీల్డ్ లో కనిపించనున్నాడు. 42 ఏళ్ల వయసులో అతడు ఇంకా ఐపీఎల్ కు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఈ మధ్యే సీఎస్కే రిటెయినర్స్ జాబితాలో ధోనీ స్థానం దక్కించుకున్నాడు. అతనితోపాటు జడేజా, రహానే, మొయిన్ అలీ, కాన్వే, రుతురాజ్, సాంట్నర్, శివమ్ దూబెలాంటి కీలక ప్లేయర్స్ ను చెన్నై రిటెయిన్ చేసుకుంది.