Team India: జింబాబ్వేపై ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇండియన్ టీమ్‌లో కనిపించకుండాపోయిన క్రికెటర్లు వీళ్లే!
Team India: జింబాబ్వే సిరీస్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కొందరు క్రికెటర్లు మళ్లీ నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ కాలేదు.ఆ క్రికెటర్లు ఎవరంటే?

Team India: ప్రస్తుతం జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తలపడుతోంది టీమిండియా. ఈ సిరీస్‌లో అనూహ్యంగా తొలి టీ20లో ఓటమి పాలైన టీమిండియా రెండో మ్యాచ్‌లో మాత్రం దంచికొట్టింది. అభిషేక్ శర్మ సెంచరీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో 20 ఓవర్లలోనే 234 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 134 పరుగులు మాత్రమే చేసింది. వంద పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 46 బాల్స్ అభిషేక్ శర్మ సెంచరీ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఎనిమిది సిక్సర్లు ఏడు ఫోర్లు ఉన్నాయి.
ముగ్గురు ఎంట్రీ...
జింబాబ్వే సిరీస్‌తో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. కోహ్లి, రోహిత్, జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో జింబాబ్వే సిరీస్‌లో రాణించి టీమిండియాలో తమ ప్లేస్‌ను సుస్థిరం చేసుకోవాలని యంగ్ ప్లేయర్లు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఈ సిరీస్‌లో ఎవరూ మెరుపులు మెరిపిస్తారో...ఏ క్రికెటర్లు అంచనాలు అందుకోలేక తుస్ మంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.
బీసీసీఐ ప్రయోగాలు...
గత కొన్నాళ్లుగా జింబాబ్వే, ఐర్లాండ్ లాంటి చిన్న దేశాలపై కొత్త ఆటగాళ్లనే ఆడిస్తూ బీసీసీఐ ప్రయోగాలు చేస్తోంది. గతంలో జింబాబ్వే సిరీస్ ద్వారా పలువురు యంగ్ ప్లేయర్లు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు.
కొందరు మాత్రం ఒక్క జింబాబ్వేపై మాత్రమే ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడి ఆ తర్వాత టీమిండియాకు మళ్లీ సెలెక్ట్ కాలేదు. ఆ ప్లేయర్లు ఎవరంటే?
ధావల్ కులకర్ణి...
టీమిండియా పేసర్ 2016లో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లకే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసిన ధావల్ కులకర్ణి మళ్లీ టీమిండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.
ధావల్ కులకర్ణితో మరో బౌలర్ బరీందర్ స్రాన్ కూడా 2016లో జింబాబ్వేపై రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయినా ఈ ఒక్క సిరీస్‌తోనే అతడి నేషనల్ కెరీర్‌కు ముగింపు పడింది. మళ్లీ టీమిండియాలో బరీందర్ స్రాన్ చోటు దక్కించుకోలేకపోయాడు.
రిషి ధావన్...
ఆల్‌రౌండర్ రిషి ధావన్ తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో టీమిండియా తరఫున ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. అది కూడా జింబాబ్వేపై. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో 42 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో ఒకే ఒక రన్ చేశాడు.
ఫయాజ్ ఫైజల్...
టీమిండియా ప్లేయర్లకు ఫయాజ్ ఫైజల్ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. ఈ విదర్భ క్రికెటర్ టీమిండియా తరఫున ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. 2016లో జింబాబ్వేపై ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన ఫయాజ్ 61 బాల్స్‌లో ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 రన్స్ చేసి అదరగొట్టాడు. అయినా ఫయాజ్‌కు మళ్లీ టీమిండియా నుంచి పిలుపు రాలేదు.
టాపిక్