Delhi Capitals Vice Captain: ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ ను అనౌన్స్ చేసింది. ఈ మధ్యే కెప్టెన్సీని అక్షర్ పటేల్ కు ఇచ్చిన ఆ టీమ్.. ఇప్పుడు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సిని అతనికి డిప్యూటీగా నియమించింది. ఆర్సీబీ వదిలేసిన డుప్లెస్సిని.. మెగా వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
నిజానికి గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా నియమిస్తారని భావించారు. కానీ అతన్ని పక్కన పెట్టి అక్షర్ పటేల్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇక ఇప్పుడు వైస్ కెప్టెన్సీ అయినా అతనికి దక్కుతుందనుకుంటే.. ఫాఫ్ డుప్లెస్సిని చేశారు. రాబోయే సీజన్ కోసం వైస్ కెప్టెన్ ను అనౌన్స్ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.
ఇందులో డుప్లెస్సి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నడుస్తూ ఫోన్లో మాట్లాడుతుండటం చూడొచ్చు. “హలో. నేను బాగున్నా. నువ్వెలా ఉన్నావ్? నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంకెక్కడ ఉంటాను? అవును నిజమే.. నేను ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ ను. చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఢిల్లీ టీమ్ బాగుంది” అని అవతలి వ్యక్తితో డుప్లెస్సి అనడం అందులో కనిపిస్తుంది.
ఫాఫ్ డుప్లెస్సి గతంలో ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే గతేడాది మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ అతన్ని రిటెయిన్ చేసుకోలేదు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతడు తుది జట్టులో ఉండటం కష్టమే అని పలువురు భావించారు. కానీ హ్యారీ బ్రూక్ తప్పుకోవడంతో ఫాఫ్ కు లైన్ క్లియరైంది. ఇప్పుడు ఏకంగా వైస్ కెప్టెన్ అయ్యాడు.
మూడేళ్ల పాటు అతడు ఆర్సీబీ తరఫున ఆడాడు. గతేడాది 438 రన్స్ తో రాణించాడు. అయినా ఆర్సీబీ పాయింట్ల టేబుల్లో చివరి స్థానంలో ఉండటంతో ఆ ఫ్రాంఛైజీ అతన్ని పక్కన పెట్టేసింది. 2023లో డుప్లెస్సి 730 రన్స్, 2022లో 468 రన్స్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వేలానికి ముందు అక్షర్ పటేల్ తోపాటు కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరెల్ లను రిటెయిన్ చేసుకుంది.
అక్షర్ పటేల్ (సి), కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, కె.ఎల్. రాహుల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, టి నటరాజన్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫాఫ్ డు ప్లెస్సి, ముకేష్ కుమార్, దర్శన్ నల్కండే, విప్రాజ్ నిగమ్, దుష్మంత చమీరా, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ.
సంబంధిత కథనం