WPL 2025: ఢిల్లీ జోరు.. చెలరేగిన లానింగ్, అనబెల్.. యూపీ వారియర్స్ పై చివరి ఓవర్లో విజయం
WPL 2025: డబ్ల్యూపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగిస్తోంది. ఈ సీజన్ లో ఆ జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం (ఫిబ్రవరి 19) యూపీ వారియర్స్ పై ఢిల్లీ గెలిచింది.

వుమెన్స్ ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కు రెండో విజయం. బుధవారం (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ పై గెలిచింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ మరో బంతి మిగిలి ఉండగా విక్టరీ సాధించింది. మొదట యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో గెలిచింది.
మెరుపు ఆరంభం
ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కు మెరుపు ఆరంభం దక్కింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (49 బంతుల్లో 69 పరుగులు), షెపాలి వర్మ (16 బంతుల్లో 26 పరుగులు) బౌండరీల వేటలో పోటీపడ్డారు. దీంతో స్కోరుబోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. 6 ఓవర్లకు వికెట్లేమీ నష్టపోకుండా 59 పరుగులు చేసిన ఢిల్లీ ఛేదనలో బలమైన పునాది వేసుకుంది. కానీ ఆ వెంటనే షెఫాలి, జెమీమా (0) ఔటైపోవడంతో ఢిల్లీ జోరుకు బ్రేక్ పడింది.
ఆ ఇద్దరు కలిసి
ఛేదనలో తడబడ్డ ఢిల్లీ జట్టును లానింగ్, అనబెల్ కలిసి విజయం దిశగా తీసుకెళ్లారు. అంతకుముందు బౌలింగ్ లో మెరిసిన అనబెల్ (35 బంతుల్లో 41 నాటౌట్) బ్యాటింగ్ లోనూ సత్తాచాటింది. లానింగ్ ఔటైనా మరీన్ కాప్ (29 నాటౌట్)తో కలిసి అనబెల్ జట్టును గెలిపించింది. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 11 పరుగులు అవసరమవగా.. అనబెల్ వరుసగా రెండు ఫోర్లతో పని తేలిక చేసింది.
కిరణ్ కేక
డబ్ల్యూపీఎల్ 2025లో ఢిల్లీతో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ లో కిరణ్ నవ్ గిరె (27 బంతుల్లో 51) అదరగొట్టింది. మెరుపు షాట్లు ఆడిన ఆమె 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదింది. ఆ జట్టు స్కోరు 5 ఓవర్లకే 58. అప్పుడు జట్టు జోరు చూస్తే 200 చేసేలా కనిపించింది. కానీ గొప్పగా పుంజుకున్న ఢిల్లీ బౌలర్లు యూపీని కట్టడి చేశారు. అనబెల్ తన వరుస ఓవర్లలో ఓపెనర్లను ఔట్ చేసింది. శ్వేత (37), హెన్రీ (33 నాటౌట్) మెరుపులతో యూపీ స్కోరు 160 దాటింది.
సంబంధిత కథనం