WPL 2024: డబ్ల్యూపీఎల్ ఫైనల్‍కు దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్‍పై ధమాకా గెలుపు-delhi capitals reaches wpl 2024 final after win against gujarat giants rcb and mumbai indians to clash in eliminator ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2024: డబ్ల్యూపీఎల్ ఫైనల్‍కు దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్‍పై ధమాకా గెలుపు

WPL 2024: డబ్ల్యూపీఎల్ ఫైనల్‍కు దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్‍పై ధమాకా గెలుపు

Chatakonda Krishna Prakash HT Telugu
Published Mar 13, 2024 11:29 PM IST

WPL 2024 DC vs GG: డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీ ఫైనల్‍కు దూసుకెళ్లింది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్. చివరి లీగ్ మ్యాచ్‍లో గుజరాత్‍పై భారీ విజయం సాధించి.. టైటిల్ పోరుకు చేరింది.

WPL 2024: డబ్ల్యూపీఎల్ ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్‍పై ధమాకా గెలుపు
WPL 2024: డబ్ల్యూపీఎల్ ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్‍పై ధమాకా గెలుపు (WPL-X)

WPL 2024 Delhi Capitals Women: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ధమాకా పర్ఫార్మెన్స్ కొనసాగింది. ప్రస్తుత రెండో సీజన్‍లో చివరి లీగ్ మ్యాచ్‍లోనూ ఢిల్లీ సత్తాచాటింది. దీంతో ఢిల్లీ నేరుగా డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‍కు చేరుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నేడు జరిగిన చివరి లీగ్ మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ టీమ్‍పై పూర్తి ఆధిపత్యంతో విజయం సాధించింది. గుజరాత్ టోర్నీ నుంచి ఔట్ అయింది.

ఈ మ్యాచ్‍లో ఆల్‍రౌండ్ షోతో అదరగొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. వరుసగా రెండో సీజన్‍లో ఫైనల్ చేరింది. ఈ చివరి లీగ్ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 126 పరుగులే చేసింది. భారతి ఫ్లుమాలీ (42) మాత్రమే రాణించారు. మిగిలిన గుజరాత్ బ్యాటర్లు విఫలమయ్యారు. జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ (0) డకౌట్ కాగా.. ఫామ్‍లో ఉన్న దయలాన్ హేమలత (4) ఎక్కువ సేపు నిలువలేదు. ఢిల్లీ బౌలర్లలో మారిజాన్ కాప్, శిఖా పాండే, మిన్ను మణి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

షెఫాలీ మెరుపులు

స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఊదేసింది. భారత ధనాధన్ ఓపెనర్, ఢిల్లీ ప్లేయర్ షెఫాలీ వర్మ 37 బంతుల్లోనే 7 ఫోర్లు 5 సిక్సర్లతో 71 పరుగులు చేశారు. మెరుపులు మెరిపించి అర్ధ సెంచరీ చేశారు. దీంతో ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. గుజరాత్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు షెఫాలీ. తన మార్క్ దూకుడైన ఆటతో దుమ్మురేపారు. ఢిల్లీ కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (18) కాసేపు నిలిచారు. అలీస్ క్యాప్సీ (0) డకౌట్ అయినా.. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ (38 నాటౌట్) అదరగొట్టారు. దీంతో ఢిల్లీ 13.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. ఏకంగా 41 బంతులు మిగిల్చి భారీ విజయం సాధించింది. బ్యాటింగ్‍లో దుమ్మురేపిన షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

టైటిల్ పోరులో ఢిల్లీ

డబ్ల్యూపీఎల్ 2024 లీగ్ దశలో 8 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఫైనల్‍కు నేరుగా అర్హత సాధించింది. గతేడాది డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్‍లోనూ ఫైనల్ చేరిన ఢిల్లీ.. మరోసారి టైటిల్ పోరులో అడుగుపెట్టింది.

ముంబై, బెంగళూరు మధ్య ఎలిమినేటర్

ఫైనల్‍లో మరో బెర్తు కోసం ముంబై ఇండియన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడున్నాయి. ఈ రెండు జట్ల మధ్య మార్చి 15వ తేదీన ఢిల్లీ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍లో గెలిచిన జట్టు ఢిల్లీతో ఫైనల్‍లో టైటిల్ కోసం తలపడనుంది. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ మార్చి 17వ తేదీన జరగనుంది.

లీగ్ దశలో 8 మ్యాచ్‍ల్లో 3 గెలిచిన యూపీ వారియర్స్, 2 మాత్రమే గెలిచిన గుజరాత్ జెయింట్స్ డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

Whats_app_banner