WPL 2025: తెలుగమ్మాయి డైవ్.. సినిమాను తలపించే క్లైమాక్స్..దిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ బాల్ విక్టరీ.. ముంబయికి షాక్-delhi capitals last ball victory over mumbai indians harman preeth nat sciver shafali verma wpl 2025 niki prasad ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2025: తెలుగమ్మాయి డైవ్.. సినిమాను తలపించే క్లైమాక్స్..దిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ బాల్ విక్టరీ.. ముంబయికి షాక్

WPL 2025: తెలుగమ్మాయి డైవ్.. సినిమాను తలపించే క్లైమాక్స్..దిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ బాల్ విక్టరీ.. ముంబయికి షాక్

Chandu Shanigarapu HT Telugu
Published Feb 15, 2025 11:16 PM IST

WPL 2025: డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ లో దిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ లో చివరి బంతికి సంచలన విజయాన్ని అందుకుంది. ముంబయి ఇండియన్స్ కు షాకిచ్చింది.

డబ్ల్యూపీఎల్ 2025 లో ముంబయి ఇండియన్స్ పై దిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విజయం
డబ్ల్యూపీఎల్ 2025 లో ముంబయి ఇండియన్స్ పై దిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విజయం

డబ్ల్యూపీఎల్ 2025లో దిల్లీ క్యాపిటల్స్ కు శుభారంభం. శనివారం (ఫిబ్రవరి 15) ఆ జట్టు 2 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ పై గెలిచింది. మొదట ముంబయి 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో 13.2 ఓవర్లకు 129/3 తో నిలిచిన ముంబయిని దిల్లీ బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు. ఛేదనలో దిల్లీ 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి గెలిచింది.

5.4 ఓవర్లకు 60/0 కానీ

ఛేదనను దిల్లీ మెరుపు వేగంతో మొదలెట్టింది. ఓపెనర్ షెఫాలి వర్మ (43) బౌండరీల వేటలో దూసుకెళ్లడంతో స్కోరు బోర్డు రాకెట్ స్పీడ్ తో సాగిపోయింది. 18 బంతులాడిన షెఫాలి 7 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టింది. చూస్తుండగానే స్కోరు 60కి చేరడంతో దిల్లీ గెలుపు ఖాయమనిపించింది. కానీ ముంబయి బౌలర్లు వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి మ్యాచ్ మలుపు తిప్పారు. 60/0 నుంచి దిల్లీ 76/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది.

వారెవా డ్రామా

వరుసగా వికెట్లు పడగొట్టిన ముంబయి బౌలర్లు దిల్లీపై పట్టు సాధించారు. 4 ఓవర్లలో 44 పరుగులు చేయాల్సిన దశలో సారా వరుసగా 4, 6 కొట్టి దిల్లీకి ఆశలు రేపింది. కానీ ఆమెను హేలీ ఔట్ చేసింది. చివరి వరకూ పోరాడిన నికీ ప్రసాద్ (35) మరో బంతి ఉందనగా ఔట్ అయిపోయింది.

దిల్లీ గెలవాలంటే చివరి బంతికి రెండు పరుగులు చేయాలి. ఆ దశలో హైదరాబాదీ క్రికెటర్ అరుంధతి రెడ్డి కవర్ వైపు బంతిని పంపించి రెండో పరుగుకు ప్రయత్నించింది. హర్మన్ త్రోతో వికెట్ కీపర్ స్టంప్స్ లేపేసింది. కానీ ఫుల్ డైవ్ చేసిన అరుంధతి నాటౌట్ గా తేలడంతో దిల్లీ డబ్ల్యూపీఎల్ 2025 లో తొలి విజయాన్ని అందుకుంది.

ధనాధన్ జోరుకు బ్రేక్

మొదట నాట్ సీవర్ (80 నాటౌట్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (42) చెలరేగడంతో ముంబయి 200 చేసేలా కనిపించింది. హర్మన్ ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొట్టింది. 190 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన ఆమె 3 సిక్సర్లు, 4 ఫోర్లు బాదింది. కానీ అద్భుతంగా పుంజుకున్న దిల్లీ బౌలర్లు ముంబయి జోరుకు బ్రేక్ వేశారు. అనబెల్ సదర్లాండ్ (3/34), శిఖా పాండే (2/14) బంతితో మెరిశారు.

Chandu Shanigarapu

eMail
Whats_app_banner

సంబంధిత కథనం