Team India Head Coach: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. జూన్‍లో జరిగే ఈ మెగాటోర్నీ కోసం ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సహా కొందరు ఆటగాళ్లు అమెరికాలో అడుగుపెట్టారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా సహా మరికొందరు త్వరలోనే బయలుదేరి వెళ్లనున్నారు. అయితే, ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నారు. దీంతో కొత్త హెడ్ కోచ్ వేటలో బీసీసీఐ ఉంది. అయితే, కోచ్ పదవికి దరఖాస్తు గడువు నేడు (మే 27) ముగిసింది.
హెడ్ కోచ్ స్థానానికి టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు ప్రధానంగా వినిపించింది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే, పూర్తిస్థాయి భారత హెడ్ కోచ్ పదవిపై హైదరాబాదీ స్టైలిష్ బ్యాటింగ్ లెజెండ్ లక్ష్మణ్ ఆసక్తి కనబరచలేదు. ఆయన దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ఫుల్ టైమ్ హెడ్ కోచ్‍గా ఉంటే సంవత్సరానికి 10 నెలలు టీమ్ వెంటే ఉండాలి. దీంతోనే లక్ష్మణ్ ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
భారత హెడ్ కోచ్ పదవికి విదేశీ స్టార్ కోచ్‍లు కూడా పెద్దగా దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. శ్రీలంక లెజెండ్స్ మహేల జయవర్దెనె, కుమార్ సంగక్కర, ఆస్ట్రేలియా స్టార్ రికీ పాంటింగ్ సహా మరికొందరు పేర్లు వినిపించాయి. వీరిలో ఎవరూ అప్లై చేయలేదని సమాచారం.
ఇక, టీమిండియా హెడ్ కోచ్‍ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ మరింత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. “తుదిగడువు అయిపోయింది. కానీ తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ అధినాయకత్వం మరింత సమయం తీసుకుంటుంది. జూన్ నెలలో టీ20 ప్రపంచకప్‍తో టీమిండియా బిజీగా ఉంటుంది. ఆ తర్వాత శ్రీలంక, జింబాబ్వేతో జరిగే సిరీస్‍లకు సీనియర్ల ప్లేయర్లకు విశ్రాంతినిస్తుంది. ఆ సిరీస్‍లకు ఎన్‍సీఏ నుంచి సీనియర్ కోచ్ ఎవరైనా జట్టుతో ఉంటారు. అందుకే తొందరేం లేదు” అని బీసీసీఐ వర్గాలు చెప్పినట్టు పీటీఐ వెల్లడించింది.
టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను కూడా హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గంభీర్ మెంటార్‌గా ఉన్న కోల్‍కతా నైట్‍రైడర్స్ దూకుడుగా ఆడి ఐపీఎల్ 2024 టైటిల్‍ను కైవసం చేసుకుంది. దీంతో గంభీర్‌ను భారత కోచ్‍గా చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టును వీడి గౌతీ.. వస్తాడా అనే విషయం సందిగ్ధంగా ఉంది. కేకేఆర్‌తోనే ఉండాలని గంభీర్‌కు కో-ఓనర్ షారుఖ్ ఖాన్ బ్లాంక్ చెక్ ఇచ్చాడనే రూమర్లు కూడా వచ్చాయి. మరి, టీమిండియా హెడ్ కోచ్‍గా ఉండేందుకు గంభీర్ ఆసక్తి చూపుతాడా లేదా అనే విషయంపై ఇప్పటికి క్లారిటీ లేదు.
జూన్ 2వ తేదీ నుంచి జూన్ 29వ తేదీన వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. జూన్ 5వ తేదీన ఐర్లాండ్‍తో మ్యాచ్‍లో వరల్డ్ కప్ వేటను భారత్ మొదలుపెట్టనుంది. గ్రూప్ దశ మ్యాచ్‍లను అమెరికాలోనే ఆడనుంది.