DC vs LSG Live Score: దంచి కొట్టిన పూరన్, మార్ష్.. చివర్లో తడబడిన లక్నో.. ఢిల్లీపై భారీ స్కోరు
DC vs LSG Live Score: ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో బ్యాటర్లు నికొలస్ పూరన్, మిచెల్ మార్ష్ చెలరేగిపోయారు. అయితే చివర్లో తడబడటంతో లక్నో మరీ భారీ స్కోరు చేయలేకపోయింది. ఢిల్లీ బౌలర్లు చివరి ఐదు ఓవర్లలో లక్నోను కట్టడి చేశారు.
DC vs LSG Live Score: లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు నికొలస్ పూరన్, మిచెల్ మార్ష్ దంచి కొట్టారు. ఈ ఇద్దరూ మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో లక్నో భారీ స్కోరు చేసింది. పూరన్ 75, మార్ష్ 72 రన్స్ చేశారు. ఢిల్లీ బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నో జోరుకు కాస్త బ్రేకులు వేశారు. లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 రన్స్ చేసింది.
పూరన్, మార్ష్ మెరుపు హాఫ్ సెంచరీలు
ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగింది. మొదటి నుంచీ ఢిల్లీ బౌలర్లపై ఆ టీమ్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ ఏడెన్ మార్‌క్రమ్ (15) విఫలమైనా.. మార్ష్ మాత్రం ఢిల్లీ బౌలర్లతో ఆటాడుకున్నాడు. అతడు 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్స్ లతో 72 రన్స్ చేశాడు.
అటు పూరన్ కూడా మరింత చెలరేగిపోయాడు. 30 బంతుల్లోనే 7 సిక్స్ లు, 6 ఫోర్లతో 75 రన్స్ చేయడం విశేషం. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన ఓ ఓవర్లో అతడు వరుసగా నాలుగు సిక్స్ లు బాదాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 87 రన్స్ జోడించారు. అది కూడా కేవలం 42 బంతుల్లోనే. అయితే ఈ ఇద్దరూ ఔటైన తర్వాత లక్నో తడబడింది. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది.
రిషబ్ పంత్ డకౌట్
ఈ ఏడాదే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ వెళ్లి కెప్టెన్ అయిన రిషబ్ పంత్ తొలి మ్యాచ్ లోనే డకౌటయ్యాడు. అతడు ఆరు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అతనితోపాటు ఆయుష్ బదోనీ (4), శార్దూల్ ఠాకూర్ (0) కూడా విఫలమయ్యారు.
అయితే డేవిడ్ మిల్లర్ చివరి వరకూ క్రీజులో ఉండి లక్నో స్కోరును 200 దాటించాడు. మిల్లర్ 19 బంతుల్లో 2 సిక్స్ లు 1 ఫోర్ తో 27 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులను అతడు సిక్స్ లుగా మలిచాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 రన్స్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అటు అక్షర్ పటేల్ కూడా 3 ఓవర్లలో కేవలం 18 రన్సే ఇచ్చాడు.
సంబంధిత కథనం