DC vs KKR: వైజాగ్ మ్యాచ్‍లో టాస్ గెలిచిన కోల్‍కతా.. మైలురాయిపై పంత్ కన్ను.. తుది జట్లు ఇలా..
DC vs KKR IPL 2024: వైజాగ్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‍కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. గత మ్యాచ్‍లో దుమ్మురేపిన ఢిల్లీ.. అదే జోరును కొనసాగించాలని కసిగా ఉంది. ఈ పోరులో టాస్ గెలిచింది కోల్‍కతా.
DC vs KKR: ఐపీఎల్ 2024లో తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడి నిరాశపరిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. గత పోరులో గెలిచి గాడిలో పడింది. కోల్‍కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‍లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‍ల్లో గెలిచి జోష్‍తో ఉంది. హ్యాట్రిక్‍పై కన్నేసింది. ఈ రెండు జట్లు నేడు (ఏప్రిల్ 3) తలపడుతున్నాయి. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), కోల్‍కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్ల మధ్య నేడు మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన కోల్‍కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు.
ఈ ఫీట్‍పై పంత్ కన్ను
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషన్ పంత్ కీలకమైన మైలురాయికి చేరువగా ఉన్నాడు. మరో 65 రన్స్ చేస్తే రిషబ్ పంత్ ఐపీఎల్‍లో 3,000 పరుగులకు చేరుకుంటాడు. 3వేల ఐపీఎల్ పరుగులు చేసిన 22వ బ్యాటర్‌గా నిలువనున్నాడు. ఈ మ్యాచ్‍లోనే ఈ ఫీట్ సాధించాలని పంత్ పట్టుదలగా ఉన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ముకేశ్ కుమార్ గాయపడడంతో ఈ మ్యాచ్‍కు దూరమయ్యాడు. అతడి స్థానంలో తుది జట్టులో సుమీత్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు. ఒకవేళ టాస్ గెలిచి ఉంటే తాను కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకునే వాడినని పంత్ అన్నాడు. రెండో బ్యాటింగ్‍కు పిచ్ కాస్త స్లో అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు.
పిచ్ బాగా ఉందని, తాను ముందుగా బ్యాటింగ్ చేస్తామని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచాక చెప్పాడు. అగ్‍క్రిష్ రఘువంశీ మళ్లీ జట్టులోకి వచ్చాయని తెలిపారు.
ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు: పృథ్వి షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమీత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, ఎన్రిచ్ నోర్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
ఢిల్లీ సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: అభిషేక్ పోరెల్, కుమార్ కుషాగ్రా, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్ మ్యాక్‍గుర్క్
కోల్‍కతా నైట్ రైడర్స్ తుదిజట్టు: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరేన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, అగ్నిక్రిష్ రఘువంశీ, ఆండ్రే రసెల్, రమణ్‍దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
కోల్‍కతా సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, మనీశ్ పాండే, వైభవ్ అరోరా, రహ్మనుల్లా గుర్బాజ్
ఈ సీజన్‍లో తన తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. తన రెండో హోం గ్రౌండ్ అయిన వైజాగ్‍లో గత మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది. కెప్టెన్ రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీలతో దుమ్మురేపితే.. పృథ్వి షా బ్యాట్ ఝులిపించాడు. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్లకు 191 రన్స్ చేసింది. లక్ష్యఛేదనలో చెన్నై 6 వికెట్లకు 171 పరుగులే చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో ఢిల్లీ గెలిచింది. నేడు కోల్‍కతాపై కూడా గెలిచి.. జోష్ కొనసాగించాలని రిషబ్ పంత్ సేన జోష్‍గా ఉంది.