David Warner: మరోసారి వార్నర్ ‘పుష్ప’ సెలెబ్రేషన్స్: పాక్‍తో మ్యాచ్‍లో..: వీడియో-david warner does pushpa celebrations in world cup warmup match ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  David Warner: మరోసారి వార్నర్ ‘పుష్ప’ సెలెబ్రేషన్స్: పాక్‍తో మ్యాచ్‍లో..: వీడియో

David Warner: మరోసారి వార్నర్ ‘పుష్ప’ సెలెబ్రేషన్స్: పాక్‍తో మ్యాచ్‍లో..: వీడియో

David Warner: డేవిడ్ వార్నర్ మరోసారి పుష్ప స్టైల్‍లో సెలెబ్రేట్ చేసుకున్నాడు. పాకిస్థాన్‍తో జరిగిన వామప్ మ్యాచ్‍లో ఇది జరిగింది.

David Warner: మరోసారి వార్నర్ ‘పుష్ప’ సెలెబ్రేషన్స్: పాక్‍తో మ్యాచ్‍లో..: వీడియో (Photo: Twitter)

David Warner: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు భారతీయ సినిమాలు.. అందులోనూ తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ద్వారా భారత్‍కు చాలా దగ్గరయ్యారు వార్నర్. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు ఆడటంతో టాలీవుడ్ సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. టాలీవుడ్ హీరోలను అనుకరిస్తూ గతంలో సోషల్ మీడియాలో చాలా వీడియోలు కూడా పోస్ట్ చేశారు వార్నర్. డేవిడ్ వార్నర్‌కు అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప చిత్రం అంటే ఎంతో ఇష్టం. గతంలో పుష్ప క్యారెక్టర్‌ను ఇమిటేట్ చేస్తూ వీడియోస్ చేశారు. ఇప్పుడు ఏకంగా గ్రౌండ్‍లోనే పుష్ప స్టైల్‍లో సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. పాకిస్థాన్‍తో నేడు (అక్టోబర్ 3) హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ వామప్ మ్యాచ్‍లో వార్నర్.. పుష్ప సినిమాలోని తగ్గేదెలే సిగ్నేచర్ మూవ్‍ చేశారు. ఆ వివరాలివే..

పాకిస్థాన్‍తో వామప్ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ లక్ష్యఛేదనకు దిగింది. అయితే, 12వ ఓవర్లో పాక్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్.. షాట్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. మిడ్‍ఆన్‍లో వార్నర్ ఆ క్యాచ్ పట్టాడు. క్యాచ్ పట్టిన తర్వాత గడ్డం కింద చేయి పెట్టుకొని.. ‘పుష్ప’ తగ్గేదెలే సిగ్నేచర్ మూవ్ చేశారు వార్నర్. ఆ తర్వాత కమిన్స్‌ను చూసి నవ్వారు.

వార్నర్ ‘పుష్ప’ సెలెబ్రేషన్స్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. హైదరాబాద్‍లో ఆడుతుండటంతో హోమ్ గ్రౌండ్‍లో ఆడుతున్నట్టు వార్నర్ ఫీలవుతున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్‍లో 2014 నుంచి 2021 వరకు సన్‍రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడారు వార్నర్. అతడి సారథ్యంలో ఎస్‍ఆర్‌హెచ్ ఓ టైటిల్ కూడా గెలిచింది.

వార్నర్.. పుష్ప మూవ్ చేసిన వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప చిత్రానికి వార్నర్ ఎవర్‌గ్రీన్ ఫ్యాన్ అని మరికొందరు రాసుకొస్తున్నారు.

అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఇండియాలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. అక్టోబర్ 8న జరిగే మ్యాచ్‍తో ఇండియా, ఆస్ట్రేలియా ప్రపంచకప్ పోరును మొదలుపెట్టనున్నాయి.