Danish Kaneria: విరాట్ కోహ్లీ షూస్‍కు కూడా బాబర్ ఆజమ్ సమానం కాదు: పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ ఘాటు వ్యాఖ్యలు
Danish Kaneria on Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‍పై ఆ దేశ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా ఫైర్ అయ్యాడు. విరాట్ కోహ్లీకి దరిదాపుల్లో కూడా బాబర్ లేడని కనేరియా చెప్పాడు.
Danish Kaneria: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో భారత్, పాకిస్థాన్ తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ నేడు (జూన్ 9) జరగనుంది. అయితే, భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ ఆజమ్‍ను పోల్చడంపై పాక్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా స్పందించాడు. ఈ విషయంపై కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ దరిదాపుల్లో కూడా బాబర్ లేడని అన్నాడు. అలాగే, ఈ ప్రపంచకప్‍లో అమెరికాపై పాకిస్థాన్ ఓడిపోవడం కూడా ఫైర్ అయ్యాడు.
షూస్‍కు కూడా సమానం కాదు
అమెరికా బౌలర్లపై కూడా బాబర్ ఆజమ్ దూకుడుగా పరుగులు చేయలేకపోయాడని దానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ షూస్‍కు కూడా బాబర్ సమానం కాదంటూ ఐఏఎన్‍ఎస్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. “బాబర్ ఆజమ్ సెంచరీ కొట్టగానే.. తర్వాతి రోజు వచ్చి అతడిని కొందరు విరాట్ కోహ్లీతో పోల్చుస్తారు. కోహ్లీ షూస్‍కు కూడా సమానం కాదు. అమెరికా బౌలర్లు బాబర్‌ను కట్టడి చేశారు. అతడు వేగంగా పరుగులు చేయలేకపోయాడు. సుమారు 40 పరుగులకు చేరగానే ఔటయ్యాడు” అని కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ప్రస్తుత టీ20 ప్రపంచకప్‍లో అమెరికా చేతిలో పాకిస్థాన్‍కు ఘోర పరాభవం ఎదురైంది. సూపర్ వరకు వెళ్లిన ఆ మ్యాచ్‍లో పాక్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‍లో బాబర్ ఆజమ్ 43 బంతుల్లో 44 పరుగులే చేశాడు. దూకుడుగా ఆడలేకపోయాడు. దీంతో పాక్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆ తర్వాత ఓటమి పాలైంది. దీంతో పాక్ జట్టుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో దానిష్ కనేరియా కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
జోక్‍లా ఉంది
పాకిస్థాన్ జట్టు ఓ జోక్‍లా ఉందని, టీ20 ప్రపంచకప్‍పై సీరియస్‍గా లేదని కనేరియా విమర్శించాడు. కుటుంబాలతో పాక్ ఆటగాళ్లు అమెరికాలో హాలీడేకు వచ్చినట్టుగా అనిపిస్తోందని అన్నాడు. గతంలో పాకిస్థాన్ చాలా విజయాలు సాధించి, గొప్ప పేరు తెచ్చుకునేందుకు అప్పట్లో ఆడిన దిగ్గజాలే కారణం అని కనేరియా అన్నాడు. అయితే, ఇప్పుడు పాకిస్థాన్ ఆటగాళ్లు ఇలా ఆడడం సిగ్గుచేటు అని దానిష్ కనేరియా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
భారతీయులకు డబుల్ సంతోషం పక్కా
భారత ప్రధాన మంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోదీకి దానిష్ కనేరియా శుభాకాంక్షలు చెప్పాడు. మోదీ చాలా అభివృద్ధి చేశారని, రామమందిరం నిర్మించారని కనేరియా అన్నాడు. నేడు మోదీ ప్రమాణ స్వీకారం ఉందని, భారత్‍పై పాకిస్థాన్ గెలుస్తుందని దానిష్ కనేరియా అన్నాడు. ఇలా.. భారతీయులకు నేడు డబుల్ సంతోషం ఉంటుందని కనేరియా చెప్పాడు.
టీ20 ప్రపంచకప్‍లో భారత్, పాకిస్థాన్ మధ్య నేడు (జూన్ 9) మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్‌లోని నసావూ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. అయితే, ఆ స్టేడియం పిచ్‍పై ఆందోళన నెలకొని ఉంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు అక్కడ జరిగిన మ్యాచ్‍లు లో స్కోరింగ్‍గానే ఉన్నాయి. బ్యాటర్లకు అత్యంత కఠినంగా న్యూయార్క్ పిచ్ ఉంది. బంతి రకరకాలుగా బౌన్స్ అవుతోంది. దీంతో, భారత్, పాక్ మ్యాచ్‍కు పిచ్ ఎలా ఉంటుందోననే ఆసక్తి ఉంది.
ఈ ప్రపంచకప్‍లో తన తొలి మ్యాచ్‍లో ఐర్లాండ్‍పై న్యూయార్క్ స్టేడియంలోనే భారత్ అలవోక విజయం సాధించింది. జోష్‍లో ఉంది. అమెరికాపై ఓడిన పాకిస్థాన్ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది.