IPL 2025 CSK vs LSG: ధోని ఫినిష్ చేస్తే ఇలా ఉంటుంది.. అదరగొట్టిన మహి.. లక్నోపై సీఎస్కే విజయం.. వరుస ఓటములకు బ్రేక్-csk breaks losing streak with dhonis match winning performance first win after five consecutive loses lsg shivam dube ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Csk Vs Lsg: ధోని ఫినిష్ చేస్తే ఇలా ఉంటుంది.. అదరగొట్టిన మహి.. లక్నోపై సీఎస్కే విజయం.. వరుస ఓటములకు బ్రేక్

IPL 2025 CSK vs LSG: ధోని ఫినిష్ చేస్తే ఇలా ఉంటుంది.. అదరగొట్టిన మహి.. లక్నోపై సీఎస్కే విజయం.. వరుస ఓటములకు బ్రేక్

IPL 2025 CSK vs LSG: ఫినిషర్ ధోని మళ్లీ కనిపించాడు. ఒకప్పటిగా బౌండరీలతో మ్యాచ్ ను ముగించాడు. సీఎస్కేను వరుస ఓటముల నుంచి బయటపడేశాడు. ఐపీఎల్ 2025లో వరుసగా అయిదు పరాజయాల తర్వాత చెన్నై ఓ మ్యాచ్ గెలిచింది. ధోని మెరుపులతో లక్నోను చిత్తుచేసింది.

సీఎస్కేను గెలిపించిన ధోని (PTI)

ధోని అంటే ఓ గొప్ప ఫినిషర్. తీవ్ర ఒత్తిడిలోనూ ఉత్కంఠను దాటి ఎన్నోసార్లు టీమ్ ను గెలిపించాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న అతనిలో 43 ఏళ్ల వయసులో ఆ మెరుపు తగ్గిందనే విమర్శలు వచ్చాయి. సోమవారం (ఏప్రిల్ 14) లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో చెలరేగిన ధోని (11 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు, ఓ సిక్సర్) 5 వికెట్ల తేడాతో సీఎస్కేను గెలిపించాడు.

ఛేజింగ్ లో సీఎస్కే 5 వికెట్లు కోల్పోయి 167 టార్గెట్ రీచ్ అయింది. లక్నో హోం గ్రౌండ్ లోనే ఆ టీమ్ ను చిత్తుచేసింది. ధోనీతో పాటు శివమ్ దూబె (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించాడు.

ఓపెనర్ల మెరుపులు

ఐపీఎల్ 2025లో లక్నోతో ఛేజింగ్ లో సీఎస్కేకు మంచి ఆరంభమే దక్కింది. ఐపీఎల్ డెబ్యూ చేసిన గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ (19 బంతుల్లో 27; 6 ఫోర్లు), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఫస్ట్ వికెట్ కు 4.5 ఓవర్లలోనే 52 రన్స్ జోడించాడు. ముఖ్యంగా 20 ఏళ్ల రషీద్ బౌండరీలతో జోరు ప్రదర్శించాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్ లో మూడు, శార్దూల్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు.

రషీద్ వికెట్ తో

ఐపీఎల్ తొలి మ్యాచ్ లో రషీద్ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఓ స్లో డెలివరీతో అతని వికెట్ ను సాధించిన అవేశ్ ఖాన్ భాగస్వామ్యం బ్రేక్ చేశాడు. ఈ వికెట్ తర్వాత ఛేజింగ్ లో సీఎస్కే తడబడింది. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, మార్ క్రమ్, దిగ్వేష్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రచిన్ ను మార్ క్రమ్ ఔట్ చేశాడు.

రాహుల్ త్రిపాఠి (9), జడేజా (7)ను పెవిలియన్ చేర్చి సీఎస్కేకు డబుల్ షాకిచ్చాడు రవి బిష్ణోయ్. విజయ్ శంకర్ (9)ను దిగ్వేష్ ఔట్ చేశాడు. 9 నుంచి 15 మధ్య 7 ఓవర్లలో సీఎస్కే 38 రన్స్ మాత్రమే చేసి, 3 వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లకు సీఎస్కే 111/5తో నిలిచింది.

ధోనీపై ఆశలు

సీఎస్కే విజయానికి 30 బంతుల్లో 56 పరుగులు కావాల్సి వచ్చింది. చెవులు దద్దరిల్లే ఫ్యాన్స్ కేకల మధ్య బ్యాటింగ్ కు వచ్చిన ధోనిపై జట్టును గెలిపించే భారం పడింది. అవేశ్ బౌలింగ్ లో ధోని వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఐపీఎల్ కొత్త రూల్స్ ప్రకారం పంత్ రిక్వెస్ట్ తో మంచు ప్రభావం కారణంగా అంపైర్లు బాల్ ఛేంజ్ చేశారు.

మరో ఎండ్ లో పరుగులు చేసేందుకు శివమ్ దూబె తీవ్రంగా ఇబ్బంది పడ్డా.. మరో వైపు ధోని బౌండరీలతో సీఎస్కేను రేసులో నిలిపాడు. కానీ దూబె కనీసం సింగిల్స్ కూడా తీయలేకపోయాడు. 18వ ఓవర్లో వరుసగా రెండు డాట్ బాల్స్ ఆడాడు.

తీవ్ర ఉత్కంఠ

సీఎస్కే సమీకరణం 12 బంతుల్లో 24 పరుగులుగా మారడంతో ఉత్కంఠ రేగింది. కానీ అప్పటివరకూ సింగిల్స్ తీయడానికీ కష్టపడ్డ దూబె.. శార్దూల్ వేసిన 19వ ఓవర్లో చెలరేగాడు. వరుసగా 4, 6 బాదాడు. ఆ సిక్సర్ వచ్చిన ఫుల్ టాస్ నోబాల్ కావడం గమనార్హం. అదే ఓవర్లో ధోని క్యాచ్ ను బిష్ణోయ్ డ్రాప్ చేశాడు. లాస్ట్ బాల్ కు ధోని ఫోర్ కొట్టడంతో లాస్ట్ ఓవర్లో సీఎస్కేకు 5 రన్స్ మాత్రమే కావాల్సి వచ్చింది. లాస్ట్ ఓవర్ తొలి రెండు బంతుల్లో రెండు సింగిల్స్ వచ్చాయి. మూడో బాల్ కు దూబె ఫోర్ తో మ్యాచ్ ముగించాడు.

పంత్ పోరాటం

అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ను కెప్టెన్ రిషబ్ పంత్ ఆదుకున్నాడు. స్లో బ్యాటింగ్ పిచ్ పై ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది.

సీఎస్కే బౌలర్లలో మతీష పతిరణ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం