India vs Ireland: స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ చేసిన తొలి సిరీస్‍ను టీమిండియా కైవసం చేసుకుంది. డబ్లిన్ వేదికగా నేడు (ఆగస్టు 20) జరిగిన రెండో టీ20లో భారత జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‍లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుపును ఖరారు చేసుకుంది. రెండో టీ20లో ముందుగా బ్యాటింగ్ టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (58) అర్ధశకతంతో అదరగొట్టగా.. సంజూ శాంసన్ (40), రింకూ సింగ్ (38) మెరుపులు మెరిపించారు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్‍కార్తీ రెండు, మార్క్ అడైర్, క్రెగ్ యంగ్, బెన్ వైట్ చెరో వికెట్ తీశారు. లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులే చేయగలిగింది. యాండీ బాల్ బిర్నీ (72) మినహా మిగిలిన ఐర్లాండ్ బ్యాటర్లు రాణించలేకపోయారు. భారత బౌలర్లలో కెప్టెన్ జస్‍ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్‍కు చెరో రెండు వికెట్లు దక్కాయి. టీమిండియా తరఫున బ్యాటింగ్ చేసిన తొలి మ్యాచ్‍లోనే రింకూ సింగ్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ఎలా సాగిందో ఇక్కడ చూడండి.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‍కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కింది. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (18), రుతురాజ్ గైక్వాడ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. బౌండరీల మోత మోగించారు. అయితే, నాలుగో ఓవర్లో జైస్వాల్ ఔటయ్యాడు. తిలక్ వర్మ (1) కూడా అలా వచ్చి.. ఇలా వెళ్లాడు. అయితే, ఆ తర్వాత రుతురాజ్, సంజూ శాంసన్ రఫ్పాడించారు. నెమ్మదిగా మొదలుపెట్టిన సంజూ ఆ తర్వాత విరుచుకుపడ్డాడు. తనదైన హిట్టింగ్‍తో వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో 12వ ఓవర్లలోనే టీమిండియా స్కోరు 100 దాటింది. అయితే, 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐర్లాండ్ స్పిన్నర్ వైట్ బౌలింగ్‍లో శాంసన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు, దీటుగా ఆడిన రుతురాజ్ 39 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతడు కూడా కాసేపటి ఔటయ్యాడు. అనంతరం టీమిండియా తరఫున తొలిసారి బ్యాటింగ్‍కు దిగిన రింకూ సింగ్ అదరగొట్టాడు. మూడు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. చివర్లో శివమ్ దూబే (22 నాటౌట్) కూడా వేగంగా ఆడటంతో టీమిండియా 185 పరుగుల మంచి స్కోరు చేసింది.
లక్ష్యఛేదనలో ఐర్లాండ్‍కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ పౌల్ స్టిర్లింగ్ (0), లుకన్ టకర్ (0)ను మూడో ఓవర్లో ఔట్ చేశాడు భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. హెర్రీ టకర్ (7) కూడా త్వరగా ఔటవటంతో 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ఐర్లాండ్. అయితే, మరో ఓపెనర్ యాండీ బాల్‍బిర్నీ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలను దీటుగా ఎదుర్కొన్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పరుగుల వేగాన్ని మాత్రం తగ్గించలేదు. కర్టిస్ కంపెర్ (18), జార్జ్ డాక్రెల్ (13) ఎక్కువసేపు నిలువలేకపోయారు. గత మ్యాచ్ హాఫ్ సెంచరీ హీరో బ్యారీ మెక్‍కార్తీ (2)ని భారత కెప్టెన్ బుమ్రా ఔట్ చేశాడు. మరోవైపు, బాల్‍బిర్నీ చాలాసేపు పోరాడాడు. ఈ క్రమంలో 39 బంతుల్లోనే అర్ధ శతకానికి చేరాడు. ఆ తర్వాత కూడా మెరిపించాడు. అయితే, 16వ ఓవర్లో భారత పేసర్ అర్షదీప్ అతడిని ఔట్ చేశాడు. దీంతో టీమిండియా గెలుపు సునాయాసమైంది. చివర్లో మార్క్ అడైర్ (23) పోరాడినా అప్పటికే మ్యాచ్ ఐర్లాండ్ చేయి దాటిపోయింది. మొత్తంగా 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులకు పరిమితమైంది ఐర్లాండ్.
ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‍ను 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ సిరీస్‍లో చివరిదైన మూడో టీ20 బుధవారం (ఆగస్టు 23) జరగనుంది. కాగా, గాయం కారణంగా 11 నెలలు భారత జట్టుకు దూరమైన స్టార్ పేసర్ బుమ్రా ఈ సిరీస్‍తోనే రీ-ఎంట్రీ ఇచ్చాడు. తొలిసారి టీమిండియాకు కెప్టెన్సీ చేస్తున్నాడు.