SA vs NZ: దుమ్మురేపిన దక్షిణాఫ్రికా.. భారీ గెలుపు.. న్యూజిలాండ్‍కు హ్యాట్రిక్ పరాజయం
SA vs NZ World Cup 2023 Match 32: న్యూజిలాండ్‍పై దక్షిణాఫ్రికా భారీ విజయాన్ని సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‍లో సత్తాచాటిన సఫారీలు.. కివీస్ జట్టును కకావికలం చేశారు.
SA vs NZ World Cup 2023 Match 32: వన్డే ప్రపంచకప్‍లో దక్షిణాఫ్రికా మరో భారీ విజయాన్ని సాధించింది. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపి సత్తాచాటింది. వన్డే ప్రపంచకప్‍లో నేడు (నవంబర్ 1) జరిగిన మ్యాచ్‍లో దక్షిణాఫ్రికా ఏకంగా 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‍పై విజయం సాధించింది. సఫారీ బౌలర్లు విజృంభించటంతో భారీ లక్ష్యఛేదనలో కివీస్ కుదేలైంది.
358 పరుగుల టార్గెట్ ముందుండగా.. న్యూజిలాండ్ 35.3 ఓవర్లలో కేవలం 167 పరుగులకే ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (60) మినహా మిగిలిన న్యూజిలాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 8 మంది కివీస్ బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (4/46) నాలుగు వికెట్లతో న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్‍ను దెబ్బతీశాడు. మార్కో జాన్సెన్ మూడు వికెట్లతో రాణించగా.. కోట్జీకి రెండు, రబాడకు ఓ వికెట్ దక్కింది.
న్యూజిలాండ్ బ్యాటర్లు డెవోన్ కాన్వె (2), రచిన్ రవీంద్ర (9), టామ్ లాథమ్ (4) వెనువెంటనే ఔటయ్యారు. విల్ యంగ్ (33) కాస్త పర్వాలేదనిపించాడు. ఫిలిప్స్ ఒక్కడే చివరి వరకు ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ఎడతెరిపి లేని దాడితో కివీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 357 పరుగులు చేసింది. సఫారీ ఓపెనర్ క్వింటన్ డికాక్ (114), రాసీ వాండర్ డుసెన్ (133) సెంచరీలతో సత్తాచాటారు. న్యూజిలాండ్ బౌలర్లకు చెమటలు పట్టించారు. క్వింటన్ డికాక్ ఈ ప్రపంచకప్‍లో ఏకంగా నాలుగో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఇక, డికాక్, డుసెన్ తర్వాత డేవిడ్ మిల్లర్ 30 బంతుల్లో 53 పరుగులతో చెలరేగిపోయాడు. 4 సిక్సర్లతో మెరిపించాడు. దీంతో సఫారీ జట్టు భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ రెండు, బౌల్ట్, నీషమ్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఈ ప్రపంచకప్‍లో దక్షిణాఫ్రికాకు ఇది వరుసగా నాలుగో విజయం. న్యూజిలాండ్‍కు వరుసగా మూడో పరాజయం.
మళ్లీ టాప్‍కు..
ఈ గెలుపుతో ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం (నవంబర్ 1) దక్షిణాఫ్రికా మళ్లీ టాప్‍కు చేరింది. ఏడు మ్యాచ్‍ల్లో ఆరింట గెలిచి 12 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఉంది. సెమీస్‍కు చేరువైంది. ఇక, ఈ టోర్నీలో తొలుత వరుసగా నాలుగు మ్యాచ్‍లు గెలిచిన న్యూజిలాండ్.. ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్‍ల్లో ఓడింది. దీంతో ప్రస్తుతం 8 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి పడింది న్యూజిలాండ్. ఆస్ట్రేలియా మూడో స్థానానికి వచ్చింది.
వన్డే ప్రపంచకప్‍లో భారత్, శ్రీలంక మధ్య రేపు (నవంబర్ 2) మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో అజేయంగా ఉన్న భారత్.. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే మళ్లీ పాయింట్ల పట్టికలో టాప్‍కు వస్తుంది.
సంబంధిత కథనం