IND vs WI 5th T20: సిరీస్ పాయె.. ఐదో టీ20లో టీమిండియా ఓటమి-cricket news ind vs wi 5th t20 highlights west indies defeated india in series decider 5th match ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  Cricket News Ind Vs Wi 5th T20 Highlights West Indies Defeated India In Series Decider 5th Match

IND vs WI 5th T20: సిరీస్ పాయె.. ఐదో టీ20లో టీమిండియా ఓటమి

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 14, 2023 12:47 AM IST

IND vs WI 5th T20: వెస్టిండీస్‍తో ఐదో టీ20లో టీమిండియా పరాజయం పాలైంది. 2-3 తేడాతో సిరీస్‍ను కోల్పోయింది. ఈ మ్యాచ్‍తో టీమిండియా.. వెస్టిండీస్ పర్యటన ముగిసింది.

హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా (AFP)

IND vs WI 5th T20: వెస్టిండీస్ పర్యటనను టీమిండియా నిరాశతో ముగించింది. ఈ టూర్‌లో టెస్టు, వన్డే సిరీస్‍లను గెలిచిన భారత్.. టీ20 సిరీస్‍లో పరాజయం చెందింది. నేడు (ఆగస్టు 13) జరిగిన ఐదో టీ20లో వెస్టిండీస్ చేతిలో భారత జట్టు పరాజయం పాలైంది. దీంతో 3-2 తేడాతో టీ20 సిరీస్‍ను విండీస్ కైవసం చేసుకుంది. అమెరికాలోని లౌడర్‌హిల్ వేదికగా నేడు జరిగిన ఐదో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ (18 బంతుల్లో 27 పరుగులు) రాణించాడు. అయితే, మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ నాలుగు, అకీల్ హొసీన్, హోల్డర్ చెరో రెండు వికెట్లు తీశారు. బ్రెండెన్ కింగ్ (55 బంతుల్లో 85 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో వెస్టిండీస్ లక్ష్యాన్ని18 ఓవర్లలోనే ఛేదించింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 171 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47 పరుగులు) కూడా రాణించాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, తిలక్ వర్మకు చెరో వికెట్ దక్కింది. మ్యాచ్ ఎలా సాగిందో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

సూర్య ఒక్కడే..

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది టీమిండియా. గత మ్యాచ్‍లో సత్తాచాటిన భారత యువ ఓపెనర్లు ఈ కీలకమైన ఐదో టీ20లో తేలిపోయారు. యశస్వి జైస్వాల్ (5) తొలి ఓవర్లోనే వెనుదిరగగా.. శుభ్‍మన్ గిల్ (9)ను కూడా మూడో ఓవర్లో వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హుసేన్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. అయితే, ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ దూకుడుగా ఆడారు. బౌండరీలుతో చెలరేగారు. ముఖ్యంగా తిలక్ ప్రారంభం నుంచి బాదుడు మొదలుపెట్టాడు. అయితే, తన సొంత బౌలింగ్‍లో విండీస్ స్పిన్నర్ చేజ్ అద్భుత క్యాచ్ పట్టడంతో తిలక్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. సంజూ శాంసన్ (13), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (14) రాణిించలేకపోయారు. సూర్య కుమార్ యాదవ్ మాత్రం మరో ఎండ్‍లో పరుగులు వేగంగా చేశాడు. 38 బంతుల్లోనే అర్ధ శతకానికి చేరాడు. అయితే, కాసేపటికే హోల్డర్ బౌలింగ్‍లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు సూర్య. అక్షర్ పటేల్ (13) వేగంగా పరుగులు చేయలేకపోయాడు. చివర్లో ఎవరూ దూకుడుగా ఆడలేకపోవటంతో ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులకే పరిమితమైంది.

రఫ్ఫాడించిన కింగ్ - పూరన్

మోస్తరు లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‍కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కైల్ మేయర్స్ (10)ను భారత పేసర్ అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. అయితే, ఆ తర్వాతే టీమిండియాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్ నిలకడగా ఆడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బౌండరీల మోత మెగించారు. భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లాన్స్ ఫలించలేదు. కింగ్ - పూరన్ భాగస్వామ్యం దూసుకెళ్లింది. కింగ్ నిలకడగా ఆడితే ఆరంభంలో పూరన్ దూకుడు చూపాడు. ఆ తర్వాత కింగ్ కూడా హిట్టింగ్ చేశాడు. దీంతో 10 ఓవర్లకు 96 పరుగులు చేసి వెస్టిండీస్ మంచి స్థితిలో నిలిచింది.

ఆ తర్వాత కింగ్ 38 బంతుల్లోనే అర్ధ శకతం పూర్తి చేశాడు. అనంతరం వెలుతురు సరిగా లేని కారణంగా మ్యాచ్ కాసేపు నిలిచింది. మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక పూరన్‍ను తిలక్ వర్మ ఔట్ చేయటంతో భారత్ గెలుపు ఆశలు మళ్లీ రేగాయి. అయితే, కింగ్ దూకుడుగా ఆడి వెస్టిండీస్‍ను గెలిపించాడు. అతడికి షాయ్ హోప్ (13 బంతుల్లో 22 పరుగులు) సహకరించాడు. దీంతో 12 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్ ఈ ఐదో టీ20 గెలిచి.. 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది.

మొత్తంగా వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‍లను గెలిచిన టీమిండియాకు టీ20 సిరీస్‍లో షాక్ ఎదురైంది. ఈ మ్యాచ్‍తో ఈ టూర్ ముగిసింది. ఆగస్టు 18వ తేదీన మొదలుకానున్న ఐర్లాండ్ పర్యటనలో మూడు టీ20లు ఆడనుంది భారత జట్టు.

WhatsApp channel
వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లేటెస్ట్ అప్‌డేట్స్ చూడండి  Cricket News  అలాగే  Live Score  ఇంకా Telugu News  మరెన్నో క్రికెట్ న్యూస్ హిందుస్తాన్ టైమ్స్ లో చూడండి.