Rohit Sharma: రోహిత్ శర్మ ‘యోయో టెస్ట్’ పాసవుతున్నాడా? ఆన్సర్ చెప్పిన టీమిండియా కోచ్-cricket news in telugu rohit sharma looks bulky but fittest says team india coach ankit kaliyar ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: రోహిత్ శర్మ ‘యోయో టెస్ట్’ పాసవుతున్నాడా? ఆన్సర్ చెప్పిన టీమిండియా కోచ్

Rohit Sharma: రోహిత్ శర్మ ‘యోయో టెస్ట్’ పాసవుతున్నాడా? ఆన్సర్ చెప్పిన టీమిండియా కోచ్

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 11, 2023 03:37 PM IST

Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‍నెస్ గురించి చాలాకాలంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతడు యోయో టెస్ట్ పాసవుతున్నాడా అనే సందేహాలు ఉన్నాయి. టీమిండియా కండిషనింగ్ కోచ్ తాజాగా ఈ విషయంపై స్పందించారు.

Rohit Sharma: రోహిత్ శర్మ ‘యోయో టెస్ట్’ పాసవుతున్నాడా? ఆన్సర్ చెప్పిన టీమిండియా కోచ్
Rohit Sharma: రోహిత్ శర్మ ‘యోయో టెస్ట్’ పాసవుతున్నాడా? ఆన్సర్ చెప్పిన టీమిండియా కోచ్ (REUTERS)

Rohit Sharma: టీమిండియాలో ఒకప్పుడు ఫిట్‍నెస్‍పై అంతగా శ్రద్ద ఉండేది కాదు. అయితే, విరాట్ కోహ్లీ వచ్చాక అంతా మారిపోయింది. అతడు కెప్టెన్ అయినప్పటి నుంచి భారత ఆటగాళ్ల ఫిట్‍నెస్‍లో మార్పు వచ్చింది. అందరూ ఆ విషయంపై దృష్టి పెట్టి ఫిట్‍నెస్‍ను మెరుగుపరుచుకున్నారు. భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే యోయో టెస్ట్ పాసవ్వాలన్న నిబంధన కూడా వచ్చింది. ఆటగాళ్ల ఫిట్‍నెస్‍ను కొలిచేదే ఈ టెస్ట్. విరాట్ కోహ్లీ కెప్టెన్‍గా తప్పుకున్నాక రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు కూడా ఈ యోయో టెస్ట్ కొనసాగుతోంది.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‍నెస్‍పై కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. అతడు కొంచెం బొద్దుగా కనిపిస్తుండటంతో హిట్‍మ్యాన్ ఫిట్‍గా ఉన్నాడా అంటూ సందేహాలు రేగుతున్నాయి. అసలు అతడు యోయో టెస్టు పాసవుతున్నాడా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీమిండియా కండిషనింగ్ కోచ్ అంకిత్ కలియార్ మాట్లాడారు.

రోహిత్ శర్మ బొద్దుగా కనిపించినా.. ఫిట్‍నెస్‍లో అత్యుత్తమంగా ఉంటాడని అంకిత్ స్పష్టం చేశారు. అతడు యోయో టెస్టు ఎప్పుడూ పాసవుతూనే ఉన్నాడని తెలిపారు. “రోహిత్ శర్మ ఫిట్ ప్లేయర్. అతడికి మంచి ఫిట్‍నెస్ ఉంటుంది. అతడు కాస్త బొద్దుగా కనిపిస్తాడు. కానీ ఎప్పుడూ యోయో టెస్టులు పాసవుతున్నాడు. విరాట్ కోహ్లీలాగే అతడు ఫిట్‍గా ఉంటాడు. గ్రౌండ్‍లో అతడి కదలికలు అద్భుతంగా ఉంటాయి. ఫిట్టెస్ట్ క్రికెటర్లలో రోహిత్ కూడా ఒకడు” అని అంకిత్ స్పష్టం చేశారు.

ఫిట్‍నెస్‍లో విరాట్ కోహ్లీ కరెక్ట్ ఉదాహరణ అని అంకిత్ చెప్పారు. టీమిండియాలో ఫిట్‍నెస్ కల్చర్‌ను అతడు సృష్టించాడని అన్నారు. బ్యాటింగ్‍తో పాటు ఫిట్‍నెస్ పరంగానూ యువ ఆటగాడు శుభ్‍మన్ గిల్.. కోహ్లీని స్ఫూర్తిగా తీసుకుంటాడని అకింత్ తెలిపారు.

టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. టీ20 సిరీస్ జరుగుతోంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ వాన కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 మంగళవారం (డిసెంబర్ 12) జరగనుంది. అయితే, ఈ టూర్‌లో టీ20, వన్డే సిరీస్‍లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నారు. రెండు టెస్టుల సిరీస్ ఆడనున్నారు.

WhatsApp channel