Agarkar on Dhawan: శిఖర్ ధావన్‌కు అన్ని దారులు మూసుకుపోయినట్లేనా.. తేల్చేసిన చీఫ్ సెలక్టర్
Agarkar on Dhawan: శిఖర్ ధావన్‌కు అన్ని దారులు మూసుకుపోయినట్లేనా? అతడు టీమిండియాలోకి మళ్లీ రావడం కుదరదా? తాజాగా ఆసియా కప్‌కు టీమ్ ను ఎంపిక చేసిన తర్వాత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కామెంట్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
Agarkar on Dhawan: టీమిండియా ఓపెనర్ గా శిఖర్ ధావన్ పదేళ్ల కిందట అరంగేట్రం చేశాడు. తొలి టెస్టులోనే భారీ సెంచరీతో అదరగొట్టాడు. తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ లోనూ నిలకడగా రాణించాడు. ఐపీఎల్లో ధావన్ అంత నిలకడైన ఆట మరెవరూ ఆడలేదు. అయినా టీమిండియాలో మాత్రం అతనికి చోటు ఎప్పుడూ గ్యారెంటీ కాదు.
కొన్నాళ్లుగా అసలు ధావన్ పేరును సెలక్టర్లు పరిశీలించడం లేదు. ద్రవిడ్ కోచ్ గా వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ధావన్ కే నేరుగా చెప్పేశారు. తాజాగా ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులోనూ ఊహించినట్లే ధావన్ పేరును అసలు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే దీనిపై టీమ్ ఎంపిక తర్వాత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు.
"రోహిత్ మంచి ప్లేయర్. శుభ్‌మన్ ఏడాదిగా అద్భుతంగా ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. శిఖర్ ఇండియాకు మంచి ప్లేయర్. కానీ ఈ సమయంలో ఈ ముగ్గురే బాగా ఆడుతున్నారు. 15 మందిలో అందరినీ చేర్చలేం. దురదృష్టవశాత్తూ శిఖర్ కు చోటు దక్కలేదు. ప్రస్తుతానికి వీళ్లే మా ఓపెనర్లు" అని అగార్కర్ స్పష్టం చేశాడు.
గతేడాది సెకండ్ రేట్ జట్లను పంపించినప్పుడు శిఖర్ ధావనే కెప్టెన్ గా ఉన్నాడు. కానీ ధావన్ కొన్ని మ్యాచ్ లలో విఫలం కావడం, అదే సమయంలో గిల్, ఇషాన్ తమను తాము ప్రూవ్ చేసుకోవడంతో తిరిగి అతడు జట్టులోకి రాలేకపోయాడు. గతేడాది బంగ్లాదేశ్ తో టీమిండియా తరఫున ధావన్ తన చివరి మ్యాచ్ ఆడాడు. మరోవైపు ఆసియా కప్ జట్టులోకి రాహుల్, శ్రేయస్, బుమ్రా గాయాల తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.
చైనాలో సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య జరగాల్సిన ఆసియన్ గేమ్స్‌కు సెలెక్టర్లు.. ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేశారు. ఆ సమయంలో భారత్‍లో వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో ఆ టోర్నీలో టీమిండియాలో చోటు దక్కని ఆటగాళ్లతో ఆసియన్ గేమ్స్ కోసం జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే, కనీసం ఆ జట్టులోనూ శిఖర్ ధావన్‍కు చోటు దక్కలేదు. అతడి సారథ్యంలోనే ఆసియన్ గేమ్స్‌లో టీమిండియా బరిలోకి దిగుతుందని అంచనాలు రాగా.. సెలెక్టర్లు కనీసం ధావన్‍ను ఎంపిక కూడా చేయలేదు.