Asia Cup 2023: తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ దూరం.. మరి ఎందుకు తీసుకున్నట్లో?
Asia Cup 2023: తొలి రెండు మ్యాచ్‌లు కేఎల్ రాహుల్ ఆడటం లేదు. ఈ విషయాన్ని మంగళవారం (ఆగస్ట్ 29) హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కన్ఫమ్ చేశాడు. దీంతో అతన్ని ఎందుకు తీసుకున్నట్లు అంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Asia Cup 2023: ఆసియా కప్ కోసం స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసినా.. అతడు మాత్రం తొలి రెండు మ్యాచ్ లు ఆడటం లేదు. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని రాహుల్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే తొలి మ్యాచ్ సమయానికి అతడు ఫిట్ గా ఉంటాడని భావించారు. కానీ పాకిస్థాన్ తో మ్యాచే కాదు.. నేపాల్ తో మ్యాచ్ కూడా కేఎల్ ఆడబోవడం లేదని మంగళవారం (ఆగస్ట్ 29) కోచ్ ద్రవిడ్ వెల్లడించాడు.
ట్రెండింగ్ వార్తలు
బుధవారం (ఆగస్ట్ 30) ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. శనివారం (సెప్టెంబర్ 2) ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ టోర్నీ కోసం బుధవారం శ్రీలంకకు టీమ్ బయలుదేరనుంది. ఈ టీమ్ తోపాటు కేఎల్ రాహుల్ రావడం లేదని కూడా ఈ సందర్భంగా ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో తొడ గాయానికి గురై సర్జరీ చేయించుకున్న రాహుల్.. సరిగ్గా టీమ్ ఎంపికకు ముందు మరోసారి గాయపడ్డాడు.
ఈ గాయం పెద్దది కాదని, పాకిస్థాన్ తో మ్యాచ్ వరకూ అతడు కోలుకుంటాడంటూ 17 మంది సభ్యుల ఆసియా కప్ జట్టులో అతనికి స్థానం కల్పించారు. "కేఎల్ రాహుల్ పై స్పష్టత ఇస్తున్నాను. వారం రోజులుగా అతడు బాగానే ఉన్నాడు. ట్రైనింగ్ తీసుకున్నాడు. బాగానే కోలుకుంటున్నాడు. అయితే అతడు టోర్నమెంట్ తొలి పార్ట్ అంటే క్యాండీలో జరిగే మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు" అని మీడియాతో మాట్లాడుతూ ద్రవిడ్ చెప్పాడు.
అంతేకాదు బుధవారం (ఆగస్ట్ 30) బయలుదేరే జట్టుతోపాటు రాహుల్ ఉండబోడని కూడా తెలిపాడు. సెప్టెంబర్ 4న మరోసారి నేషనల్ క్రికెట్ అకాడెమీ ఫిట్‌నెస్ టీమ్ అతన్ని పరిశీలిస్తుందని, ఆ తర్వాతే సూపర్ 4లో రాహుల్ ఆడేది లేనిది తేలుస్తామని ద్రవిడ్ వెల్లడించాడు. అయితే అనుకూల పరిస్థితులే ఉన్నాయని, తొలి రెండు మ్యాచ్ లు మాత్రం అతడు ఆడబోడని ద్రవిడ్ చెప్పాడు.
నిజానికి పూర్తి ఫిట్ గా లేని రాహుల్ ను తీసుకోవడంపై పలువురు మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పుడు అతడు అందుబాటులో ఉండటం లేదని ద్రవిడ్ చెప్పిన తర్వాత మరి ఎందుకు తీసుకున్నట్లో అంటూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మంగళవారం (ఆగస్ట్ 29)తో ఆలూరులో ఇండియా ఆరు రోజుల క్యాంప్ ముగిసింది.