Ashwin on Rizwan: ఇదేం రనౌట్ బాబూ.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు: అశ్విన్
Ashwin on Rizwan: ఇదేం రనౌట్ బాబూ.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు అంటూ ఆసియా కప్ తొలి మ్యాచ్ లో నేపాల్ పై పాకిస్థాన్ బ్యాటర్ రిజ్వాన్ ఔటైన తీరుపై అశ్విన్ స్పందించాడు.

Ashwin on Rizwan: ఆసియా కప్ 2023 ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో ఊహించినట్లే పసికూన నేపాల్ ను కుమ్మేసింది పాకిస్థాన్. అయితే ఈ మ్యాచ్ లో పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ రనౌటైన తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వికెట్ పడిన తీరు చూసిన తర్వాత అశ్విన్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఇది చాలా అరుదుగా జరిగే ఘటన అని అతడు అన్నాడు.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ 24వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఆ ఓవర్లో రిజ్వాన్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. పరుగు కోసం వేగంగా పరుగెత్తకుండా వికెట్ల మధ్య భారంగా కదిలాడతడు. క్రీజులో బ్యాట్ కూడా పెట్టలేదు. ఈలోపే నేపాల్ ఫీల్డర్ దీపేంద్ర సింగ్ విసిరిన త్రో నేరుగా వికెట్లను తగిలింది. అప్పటికి క్రీజులోకి చేరుకోలేకపోయిన రిజ్వాన్ రనౌటయ్యాడు.
రిజ్వాన్ ఔటైన తీరు చూసి అవతలి వైపు బ్యాటింగ్ చేస్తున్న బాబర్ ఆజం కూడా తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన క్యాప్ ను విసిరికొట్టాడు. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత మంచి భాగస్వామ్యం నెలకొల్పుతున్న సమయంలో రిజ్వాన్ ఇలా ఔటవడంతో బాబర్ మింగుడుపడలేదు. కామెంటేటర్లు, అభిమానులు కూడా అతని ఔట్ పై షాక్ తిన్నారు.
అశ్విన్ దీనిపై స్పందిస్తూ ఇది చాలా అరుదుగా జరిగే ఘటన అని అన్నాడు. "బాల్ ఆ ఎత్తులో రావడంతో రిజ్వాన్ దాన్నుంచి తప్పించుకోలేకపోయాడు. సాధారణంగా వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తి డైవ్ చేసే వ్యక్తి అతడు. ఇది చాలా అరుదుగా జరిగే ఘటన. ఆ సమయంలో అతడు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో బాల్ నుంచి తప్పించుకోవడానికి వంగాల్సి వచ్చింది. స్పిన్నర్ల బౌలింగ్ స్వీప్ చేస్తాడు. కానీ హెల్మెట్ లేకపోవడం వల్ల ఆ సాహసం చేయలేకపోయాడు" అని అశ్విన్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
ఈ మ్యాచ్ లో బాబర్ (151), ఇఫ్తికార్ (109) సెంచరీల మోత మోగించడంతో పాకిస్థాన్ ఏకంగా 238 పరుగుల తేడాతో నేపాల్ ను చిత్తు చేసింది. 342 పరుగులు చేసిన పాక్.. ప్రత్యర్థిని 104 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇక ఇప్పుడు తర్వాతి మ్యాచ్ లో శనివారం (సెప్టెంబర్ 2) ఇండియాతో పాక్ తలపడనుంది.