ఆట చేత కాదు.. గెలిచిన ఇండియాను చూసి ఓర్వలేరు.. ఆసియా కప్ ట్రోఫీతో మోసిన్ పారిపోయాడు.. పాకిస్థాన్ పై ఫ్యాన్స్ ఫైర్-cricket fans fires on pakistan for mohsin naqvi running away with asia cup 2025 trophy india vs pakistan suryakumar bcci ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఆట చేత కాదు.. గెలిచిన ఇండియాను చూసి ఓర్వలేరు.. ఆసియా కప్ ట్రోఫీతో మోసిన్ పారిపోయాడు.. పాకిస్థాన్ పై ఫ్యాన్స్ ఫైర్

ఆట చేత కాదు.. గెలిచిన ఇండియాను చూసి ఓర్వలేరు.. ఆసియా కప్ ట్రోఫీతో మోసిన్ పారిపోయాడు.. పాకిస్థాన్ పై ఫ్యాన్స్ ఫైర్

పాకిస్థాన్ క్రికెట్ టీమ్, ఆ దేశానికి చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ మోసిన నఖ్వీపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆట చేత కాదు కానీ, ట్రోఫీ తీసుకుని మాత్రం పారిపోతారని తీవ్రంగా మండిపడుతున్నారు.

ఆసియా కప్ విన్నర్ ఇండియా

ఆసియా కప్ 2025లో ఇండియా అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఫైనల్లో చిత్తుచేసి ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి ఆసియా కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది. మైదానంలో పోరాడి గెలిచిన భారత్ కు మాత్రం ట్రోఫీ అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్ గా ఉన్న పాకిస్థాన్ మంత్రి మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకోమని టీమిండియా చెప్పడమే కారణం. ట్రోఫీతో మోసిన్ పారిపోయాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఏం జరిగిందంటే?

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్ గా పాకిస్థాన్ మంత్రి మోసిన నఖ్వీ ఉన్నాడు. అతని నుంచి ఆసియా కప్ 2025 ట్రోఫీని తీసుకోమని టీమిండియా ముందే చెప్పింది. దీంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూనీ ట్రోఫీ అందిస్తారనే టాక్ వినిపించింది. కానీ రెండు గంటల ఆలస్యం తర్వాత మోసిన్ నఖ్వీ స్టేజ్ పైకి వచ్చాడు. పాకిస్థాన్ ప్లేయర్లకు రన్నరప్ మెడల్స్ అందించాడు. కానీ ఇండియన్ ప్లేయర్స్ ట్రోఫీ తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఈవెంట్ ను ముగించారు.

ఆట చేత కాదు

ఇండియాకు ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వకుండా మోసిన్ నఖ్వీ పారిపోయాడని ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. హోటల్ గదిలోకి ట్రోఫీ తీసుకెళ్లి ఏం చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వ్యక్తి నుంచి కప్ అందుకోని టీమిండియా మరో స్థాయికి చేరిందని ప్రశంసిస్తున్నారు. పాకిస్థాన్ టీమ్ కు ఆట చేత కాదు, ఇలా కష్టపడి గెలిచిన టీమ్ కు కప్ ఇవ్వడానికి మనసు రాదని తీవ్రంగా మండిపడుతున్నారు.

బీసీసీఐ రియాక్షన్

"భారతదేశం ఒక దేశంతో యుద్ధం చేస్తోంది, ఆ దేశానికి చెందిన నాయకుడు మనకు ట్రోఫీని అందించాల్సి ఉంది. మన దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి నుండి మేము ట్రోఫీని అంగీకరించలేము. కాబట్టి మేము ఆ ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించాము. కానీ దాని అర్థం ఆ వ్యక్తి ట్రోఫీని, మన దేశానికి ఇవ్వవలసిన పతకాలను తన హోటల్ గదికి తీసుకువెళతాడని కాదు.

ఇది ఊహించనిది, అతని మంచి మనస్సు గెలుస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈరోజు బహుమతి ప్రదానోత్సవంలో ఆ వ్యక్తి ప్రవర్తనపై మేము చాలా తీవ్రమైన నిరసన తెలియజేయబోతున్నాం. త్వరలోనే ఆ ట్రోఫీ, పతకాలు ఇండియాకు వస్తాయని ఆశిస్తున్నాం" అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఏఎన్ఐతో అన్నారు.

సూర్య కామెంట్లు

సూర్యకుమార్ అభిషేక్‌తో కలిసి పోస్ట్-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాడు, అక్కడ అతను ట్రోఫీని అందుకోకపోవడం గురించి మాట్లాడుతూ, తన కెరీర్‌లో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పాడు.

"నేను ఎప్పుడూ చూడని విషయం ఇది. ఒక ఛాంపియన్ జట్టుకు ట్రోఫీని నిరాకరించడం. అది కూడా కష్టపడి సంపాదించినది. అది సులభంగా జరిగిందని కాదు. కానీ అది కష్టపడి సాధించిన విజయం. మేము 4వ తేదీ నుండి ఇక్కడే ఉన్నాము. ఈరోజు మెరుగైన ఆట ఆడాము. మేము దీనికి అర్హులమని నేను భావిస్తున్నాను. నేను దీనికంటే ఎక్కువ ఏమీ చెప్పలేను. నేను చాలా బాగా చెప్పానని అనుకుంటున్నా" అని భారత కెప్టెన్ విలేకరులతో అన్నాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం