MS Dhoni CSK: ధోనీని రిటెయిన్ చేసుకోవడానికి పెద్ద స్కెచ్చే వేసిన సీఎస్కే.. అడ్డు పడిన సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్
MS Dhoni CSK: ధోనీని వచ్చే ఏడాది కూడా రిటెయిన్ చేసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద ప్లానే వేసింది. అయితే ఈ ప్రతిపాదనను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు క్రికిన్ఫో రిపోర్టు వెల్లడించింది.
MS Dhoni CSK: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ధోనీ ఫ్యూచర్ ఏంటన్నది ఇంకా తెలియడం లేదు. అతడు ప్లేయర్ గా కొనసాగుతాడా రిటైరవుతాడా అన్నదీ తేలలేదు. అయితే వచ్చే ఏడాదికి కూడా ధోనీని తమతో రిటెయిన్ చేసుకోవడానికి సీఎస్కే ఓ పెద్ద స్కెచ్చే వేసింది. బీసీసీఐ ఆ దిశగా నిబంధనలు మార్చేలా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది.
ధోనీ కోసం సీఎస్కే ఇలా..
ధోనీని ఓ అన్‌క్యాప్డ్ (అంతర్జాతీయ క్రికెట్ ఆడని) ప్లేయర్ గా పరిగణించాలంటూ బీసీసీఐని చెన్నై సూపర్ కింగ్స్ డిమాండ్ చేస్తుండటం గమనార్హం. నిజానికి గతంలో ఉన్న ఓ నిబంధనను తిరిగి తీసుకురావాలని బోర్డుపై సీఎస్కే ఒత్తిడి తెస్తోంది. 2008 నుంచి 2021 వరకు అమల్లో ఉన్న ఆ నిబంధన కోసం ఆ ఫ్రాంఛైజీ పట్టుబడుతున్నట్లు ఈఎస్పీఎన్‌క్రికిన్ఫో రిపోర్టు వెల్లడించింది.
బుధవారం (జులై 31) బీసీసీఐతో జరిగిన ఫ్రాంఛైజీల సమావేశంలో ఆ టీమ్ కొత్త ప్రతిపాదనను అందరి ముందు ఉంచింది. 2021 వరకు ఐపీఎల్లో ఉన్న నిబంధన ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై ఐదేళ్లు దాటిన ప్లేయర్స్ ను అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ గా పరిగణించే అవకాశం ఉంది. అయితే 2021 నుంచి ఆ నిబంధనను బీసీసీఐ తొలగించింది.
ఇప్పుడు ధోనీ కోసం దానిని తిరిగి తీసుకురావాలని సీఎస్కే పట్టుబడుతోంది. అయితే అలా చూసినా ధోనీ రిటైరై ఇంకా నాలుగేళ్లే అవుతోంది. అతడు 2020, ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ నుంచి కూడా రిటైరవుతాడని మూడేళ్లుగా వార్తలు వస్తున్నా.. దీనిపై అటు ధోనీగానీ, ఇటు ఫ్రాంఛైజీగానీ ఏమీ చెప్పడం లేదు. ఇప్పుడు అతన్ని రిటెయిన్ చేసుకోవడానికి సీఎస్కే కొత్త ప్లాన్ వేస్తుండటం విశేషం.
వ్యతిరేకించిన కావ్య మారన్
అయితే చెన్నై సూపర్ కింగ్స్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఆ ప్లేయర్, అతని మార్కెట్ విలువను అగౌరవపరచడమే అవుతుందని, అతన్ని వేలంలో ఉంచితే అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని ఆమె వాదించారు. దీంతో మిగిలిన ఫ్రాంఛైజీలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.
రిటైరైన అంతర్జాతీయ ప్లేయర్ ను ఎప్పుడూ ఓ అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించకూడదని ఫ్రాంఛైజీలన్నీ స్పష్టం చేశాయి. ఈ ఏడాది చివర్లో జరగబోయే మెగా వేలానికి ముందు ప్లేయర్స్ రిటెన్షన్ విధానాన్ని ఈ నెల చివర్లోపు బీసీసీఐ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ విధానం కోసం ఫ్రాంఛైజీలతో బోర్డు సమావేశం అవుతోంది. అయితే కొన్ని ఫ్రాంఛైజీలు మెగా వేలాన్ని వ్యతిరేకించడంతో వచ్చే సీజన్ తర్వాత దీనిని నిర్వహించే అంశాన్ని కూడా బోర్డు పరిశీలిస్తోంది.