Chennai Rains: ఇళ్లలోనే ఉండండి: ప్రజలకు క్రికెటర్ల సూచన.. లంక ప్లేయర్ కూడా..
Chennai Rains: చెన్నైలో భారీ వరదలు సంభవించిన తరుణంలో ప్రజలకు కొందరు క్రికెటర్లు జాగ్రత్తలు తెలుపుతున్నారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.
Chennai Rains: చెన్నై నగరాన్ని వరద మరోసారి ముంచేస్తోంది. మిచౌంగ్ తుఫాను (Cyclone Michaung) కారణంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నారు. ముఖ్యంగా చెన్నై నగరంలో వాన జోరుగా కురుస్తోంది. వర్షాలు ఇంకా పడుతున్నాయి. దీంతో చెన్నై సిటీలోని కొన్ని ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. ఈ తరుణంలో చెన్నైవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని కొందరు భయాందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో కొందరు క్రికెటర్లు ఈ విషయంపై ట్వీట్లు చేస్తున్నారు.
ప్రజలు ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలని క్రికెటర్లు సూచిస్తున్నారు. “చెన్నై ప్రజలారా.. మీ రక్షణకే ప్రాధాన్యత ఇవ్వండి. ఇలాంటి కష్టమైన సమయాల్లో ఇళ్లలోనే ఉండండి. పరిస్థితిని మెరుగుపరిచేందుకు కష్టపడుతున్న అధికారులందరికీ పెద్ద సెల్యూట్. ఒకరికొకరం చేయూతనిచ్చుకుంటూ.. కలిసికట్టుగా ముందుకు వెళదాం” అని భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ ట్వీట్ చేశారు.
మరొక్క రోజు ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండాలని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశారు. “అందరూ ఇంకొక్క రోజు ఎక్కడివారు అక్కడే ఉండండి. ఒకవేళ వర్షం ఆగినా.. మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొనేందుకు సమయం పడుతుంది” అని అశ్విన్ పేర్కొన్నారు. నీరు ఉద్ధృతంగా ప్రవహించటంతో రోడ్డు కోతకు గురైన వీడియోను పోస్ట్ చేశారు.
శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ కూడా చెన్నై వరదల గురించి ట్వీట్ చేశారు. అందరూ సేఫ్‍గా ఉండాలని ఆకాంక్షించారు. “నా రెండో ఇంటి లాంటి చెన్నైకు సంబంధించిన ఓ ఫుటేజీని ఇప్పుడే చూశా. ప్రభావితులైన వారికి నా ప్రార్థనలు, ప్రేమ అందిస్తున్నా. అందరూ ధైర్యంగా, సురక్షింతంగా ఉండండి” అని తీక్షణ ట్వీట్ చేశారు. ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే తీక్షణ ఆడుతున్నారు.
ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రజలు ఇంట్లోనే ఉంటూ.. సురక్షితంగా ఉండాలంటూ ట్వీట్ చేసింది. ఈ ఫొటోను సీఎస్‍కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ తన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేశారు. మరికొందరు ప్లేయర్లు కూడా చెన్నై ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ట్వీట్స్ చేశారు.
మిచౌంగ్ తుఫాను మంగళవారం (డిసెంబర్ 5) ఆంధ్రప్రదేశ్‍లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.