ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ రోహిత్ శర్మ కెప్టెన్సీ లో గొప్ప మైల్ స్టోన్. తొమ్మిది నెలల వ్యవధిలో టీమిండియా రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంతో సారథిగా రోహిత్ కీ రోల్ ప్లే చేశాడు. రోహిత్ నాయకత్వంలో 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్.. ఇటీవల 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ టైటిల్ తో రోహిత్ శర్మ కెప్టెన్సీ కెరీర్ మరికొన్ని రోజుల పాటు ఎక్స్ టెండ్ అయిందనే చెప్పొచ్చు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు రోహితే కెప్టెన్ గా కొనసాగే అవకాశముంది.
ఐపీఎల్ 2025 తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. అయిదు టెస్టుల సిరీస్ జూన్ లో ఆరంభమవుతుంది. ఈ సిరీస్ కు రోహిత్ కెప్టెన్ గా కొనసాగే అవకాశముంది. ఈ మేజర్ ఫారెన్ టూర్ లో జట్టుకు రోహిత్ సారథ్యం వహించేలా బీసీసీఐ, జాతీయ సెలక్షన్ కమిటీ అతనికి సపోర్ట్ ఇస్తున్నట్లు సమాచారం. నిజానికి ఈ సిరీస్ కు బుమ్రాను కెప్టెన్ గా ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ రోహిత్ కే బోర్డు మద్దతుగా నిలుస్తోందనే టాక్.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్ గా రోహిత్ వరుస ఫెయిల్యూర్స్ చవిచూశాడు. స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో 0-3తో భారత్ వైట్ వాష్ ఎదుర్కొంది. సొంతగడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ వైట్ వాష్ కావడంతో కెప్టెన్ రోహిత్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలోనూ ఆసీస్ చేతిలో భారత్ ఓడింది. దీంతో కెప్టెన్ గా రోహిత్ దిగిపోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.
కెప్టెన్ గా రోహిత్ కెరీర్ కు ఎండ్ కార్డు పడుతుందనేలోపే ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ అతనికి అనుకోని వరంలా దక్కింది. ఈ టైటిల్ తో రోహిత్ తన కెప్టెన్సీ కెరీర్ ను మరింత కాలం పొడిగించుకున్నాడు. ఈ విజయంతోనే ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు రోహిత్ నే కెప్టెన్ గా కొనసాగించే సంకేతాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ లో భారత డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం సరిగ్గా లేదనే వ్యాఖ్యలు వినిపించాయి. ఆటగాళ్ల మధ్య విభేదాలున్నట్లు ప్రచారం సాగింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలవడంతో అంతా చక్కదిద్దుకుంది.
ఇక ఆటగాడిగానూ రోహిత్ మరో రెండేళ్ల పాటు అయితే కచ్చితంగా క్రికెట్లో కొనసాగే అవకాశముంది. 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనే టార్గెట్ ను రోహిత్ పెట్టుకున్నట్లే కనిపిస్తున్నాడు. నిజానికి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అలాంటిదేమీ లేదని రోహిత్ చెప్పాడు. తనలో ఆడే సత్తా ఇంకా ఉందని పేర్కొన్నాడు.
సంబంధిత కథనం