Champions Trophy live: టాస్ గెలిచిన పాకిస్థాన్.. న్యూజిలాండ్ బ్యాటింగ్.. ఛాంపియన్స్ ట్రోఫీ షురూ!
Champions Trophy live: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభమైంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ మినీ ప్రపంచకప్ తిరిగొచ్చింది. బుధవారం (ఫిబ్రవరి 19) ఈ టోర్నీలో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ ఆరంభమైంది.

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు తెరలేచింది. ఎన్నో అనుమానాలు, సవాళ్ల మధ్య ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం (ఫిబ్రవరి 19) డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ తో ఈ టోర్నీ ప్రారంభమైంది. కరాచీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ కు దిగింది.
డిఫెండింగ్ ఛాంపియన్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగింది. చివరగా 2017లో జరిగిన టోర్నీలో ఆ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ పై విజయం సాధించింది. ఈ సారి సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పాక్ ఉంది. కెప్టెన్ రిజ్వాన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం, ఫకర్ జమాన్, షహీన్ షా అఫ్రిది, నసీం షా తదితర ఆటగాళ్లతో పాక్ బలంగానే ఉంది.
జోరు మీద కివీస్
మరోవైపు న్యూజిలాండ్ సెన్సేషనల్ ఫామ్ లో ఉంది. ఇటీవల పాకిస్థాన్ లో జరిగిన ముక్కోణపు సిరీస్ లో ఆ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో పాక్ ను చిత్తుచేసింది. కెప్టెన్ శాంట్నర్, కీలక ప్లేయర్ కేన్ విలియమ్సన్, విల్ యంగ్, కాన్వే తదితర ఆటగాళ్లు కివీస్ కు బలం. అయితే మక్కోణపు సిరీస్ లో గాయపడ్డ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.
తుది జట్లు
పాకిస్థాన్: ఫకర్ జమాన్, బాబర్ ఆజం, సాద్ షకీల్, రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్ దిల్, షహీన్ షా అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
న్యూజిలాండ్: విల్ యంగ్, కాన్వే, విలియమ్సన్, డరిల్ మిచెల్, లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రాస్ వెల్, శాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, నేథన్ స్మిత్, విల్ ఒరోర్క్
సంబంధిత కథనం