ICC vs PCB: స్టేజీ మీదకు పిలవలేదని ఫిర్యాదు.. పాకిస్థాన్ ఏడుపును పట్టించుకోని ఐసీసీ.. అలా ఎందుకు చేస్తామంటూ ఎదురు ప్రశ్న-champions trophy india winner pcb official complaint no formal clarification from icc sumair ahmed jay shah ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Vs Pcb: స్టేజీ మీదకు పిలవలేదని ఫిర్యాదు.. పాకిస్థాన్ ఏడుపును పట్టించుకోని ఐసీసీ.. అలా ఎందుకు చేస్తామంటూ ఎదురు ప్రశ్న

ICC vs PCB: స్టేజీ మీదకు పిలవలేదని ఫిర్యాదు.. పాకిస్థాన్ ఏడుపును పట్టించుకోని ఐసీసీ.. అలా ఎందుకు చేస్తామంటూ ఎదురు ప్రశ్న

ICC vs PCB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏడుపును ఐసీసీ పట్టించుకోవడం లేదు. ప్రొటోకాల్ ప్రకారమే అన్ని చేస్తున్నామని పీసీబీకి ఎదురు ప్రశ్న. దాయాదికి భంగపాటు.

స్టేజీ మీదకు పిలవలేదని పీసీబీ ఫిర్యాదు

ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్యం, ఆట పరంగా పాకిస్థాన్ అవమానాలు ఎదుర్కొంటోంది. అది చాలదన్నట్లు వితండ వాదనతో ఇప్పుడు మరింతగా పరాభవం మూటగట్టుకుంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రజెంటేషన్ సమయంలో స్టేజీ మీదకు తమ ప్రతినిధిని ఎందుకు పిలవలేదంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేసింది. కానీ ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకున్నామంటున్న ఐసీసీ.. పీసీబీకి కనీసం ప్రాపర్ రిప్లే కూడా ఇవ్వడం లేదు.

అసలు ఏమైందంటే?

పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ డైరెక్టర్ సుమైర్ అహ్మద్ ను ఆదివారం ఫైనల్ ముగిశాక స్టేజీ మీదకు పిలవలేదు. దీన్ని పీసీబీ రాద్ధాంతం చేస్తోంది. దీనిపై ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. కానీ దీనిపై ఐసీసీ ఎలాంటి అధికారిక వివరణ ఇచ్చే అవకాశం లేదు. ఈ మ్యాచ్ కు పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ హాజరుకాకపోవడంతో అతని స్థానంలో సుమైర్ ను పాక్ బోర్డు ప్రతినిధిగా పంపారు.

స్టేజీపై వీళ్లు

ఆదివారం (మార్చి 9) ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలిచింది. అనంతరం విజేతకు ఐసీసీ ఛైర్మన్ జై షా ట్రోఫీ అందజేశాడు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. భారత ఆటగాళ్లకు వైట్ జాకెట్లు, మ్యాచ్ అధికారులకు పతకాలిచ్చాడు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, న్యూజిలాండ్ క్రికెట్ సీఈఓ రోజర్ టూస్ కూడా వేదికపై ఉన్నారు. ఐసీసీ బోర్డులో బీసీసీఐ డైరెక్టర్ గా సైకియా, ఆల్టర్నేటివ్ డైరెక్టర్ గా బిన్నీ ఉన్నారు.

ప్రొటోకాల్ ప్రకారమే

పీసీబీ ఫిర్యాదుపై ఎలాంటి అధికారిక వివరణ ఇచ్చే అవకాశం లేదని ఐసీసీ వర్గాలు తెలిపాయి. టోర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారమే సుమైర్ ను తప్పించడం తప్ప మరో మార్గం లేకపోయిందని పేర్కొన్నాయి. ఐసీసీ సీఈఓ జెఫ్ అలార్డైస్ ను కూడా స్టేజీపైకి పిలవలేదని ఆ వర్గాలు గుర్తు చేశాయి.

‘‘సుమైర్ అహ్మద్ పీసీబీ ఉద్యోగి మాత్రమే. ఆఫీస్ బేరర్ కాదు. అలాగే ప్రజెంటేషన్ కోసం టోర్నమెంట్ డైరెక్టర్ ఎప్పుడైనా స్టేజీ మీదకు వచ్చారేమో మీరే కనుక్కోండి? ఐసీసీ ఆపరేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ కొత్త హెడ్ గౌరవ్ సక్సేనా ఒకప్పుడు దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కానీ ప్రజెంటేషన్ కోసం స్టేజీ మీదకు వచ్చారా?’’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.

పాక్ అదే బుద్ధి

ఎంతసేపు భారత్ విజయాన్ని చూసి ఓర్వని పాకిస్థాన్.. ఈ విషయంపైనా అలాగే వ్యవహరిస్తోంది. తమకు జరిగిన అన్యాయానికి ఐసీసీ నుంచి బహిరంగ వివరణ కావాలని డిమాండ్ చేస్తోంది. ‘‘ప్రజెంటేషన్ కోసం మా సీఈఓ, టోర్నమెంట్ డైరెక్టర్ వేదికపై లేకపోవడానికి చెబుతున్న కారణాలు మాకు అర్థం కావట్లేదు. అధికారిక వివరణ కోసం ఎదురుచూస్తున్నాం' అని పీసీబీ అధికారి తెలిపాడు. ఆతిథ్య దేశంగా పాక్ ను విస్మరించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం