Champions Trophy: ఓ వన్డే మ్యాచ్ లో మొత్తం ఎన్ని ఓవర్లు ఉంటాయి? రెండు టీమ్స్ కలిపి 100 ఓవర్లు ఆడతాయి. కానీ 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా, శ్రీలంక టీమ్స్ 110.2 ఓవర్లు ఆడినా ఫలితం లేకపోయింది. చివరికి రెండు టీమ్స్ ట్రోఫీని పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే?
ఐసీసీ రూల్స్ ఒక్కోసారి చాలా వింతగా అనిపిస్తాయి. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలోనూ అలాగే అనిపించింది. వర్షం వల్ల ఓ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉన్నా.. మరుసటి రోజు కూడా ఆటను మొదటి నుంచీ ప్రారంభించాలన్న నిబంధన వల్ల ఫలితం తేలలేదు.
పైగా టీమిండియా రెండుసార్లు తమ పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో రెండు రోజులు కలిపి కేవలం 10.2 ఓవర్ల పాటు మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం రావడం గమనార్హం. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఈ ఫైనల్ మ్యాచ్ ప్రత్యేకంగా నిలిచిపోయింది.
2002 ఛాంపియన్స్ ట్రోఫీ శ్రీలంకలో జరిగింది. ఆ సమయంలో ఫైనల్ కు రిజర్వ్ డే ఉంది. ఇప్పుడైతే రిజర్వ్ డే నాడు మ్యాచ్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే మొదలుపెడుతున్నారు. కానీ అప్పట్లో రిజర్వ్ డే రోజు మళ్లీ టాస్ నుంచి ఫ్రెష్ గా మొదలుపెట్టాలన్న నిబంధన ఉంది.
దీంతో 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ను వర్షం వల్ల రెండు రోజులు ఆడించాల్సి వచ్చింది. ఆ రెండు రోజులూ శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. వాళ్ల ఇన్నింగ్స్ ముగిసి.. టీమిండియా చేజింగ్ మొదలైన కాసేపటికే వర్షం కురవడంతో మ్యాచ్ సాగలేదు. దీంతో రెండు జట్లూనే సంయుక్త విజేతలుగా ప్రకటించారు.
2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మొదటి రోజు శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్, కెప్టెన్ జయసూర్య 74 రన్స్ చేయడంతో ఆ టీమ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 244 రన్స్ చేసింది. తర్వాత చేజింగ్ ను టీమిండియా గట్టిగానే మొదలుపెట్టింది. సెహ్వాగ్ ఐదు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు బాదాడు. రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసిన సందర్భంలో వర్షం కురిసి మ్యాచ్ రద్దయింది.
మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో ఆ టీమ్ 7 వికెట్లకు 222 రన్స్ చేసింది. ఈసారి జయవర్దనే 77 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక చేజింగ్ లో టీమిండియా 8.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 రన్స్ చేసింది. సెహ్వాగ్ 25 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో మరోసారి భారీ వర్షం కురవడంతో మ్యాచ్ సాధ్యం కాలేదు.
రెండు రోజులు ఆడినా ఫలితం లేకపోవడంతో ఇండియా, శ్రీలంక ఛాంపియన్స్ ట్రోఫీని పంచుకున్నాయి. దీంతో ఇండియన్ టీమ్ మొత్తంగా 100 ఓవర్లు బౌలింగ్ చేసినా కేవలం 10.2 ఓవర్లే బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. ఒకవేళ మ్యాచ్ ను ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచే కొనసాగించి ఉంటే రిజర్వ్ డే రోజు ఎవరో ఒకరే విజేతగా నిలిచేవారు. కానీ ఐసీసీ చెత్త రూల్ తో శ్రీలంకతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని పంచుకోవాల్సి వచ్చింది.
సంబంధిత కథనం