ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ క్లాష్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం (మార్చి 9) దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మ్యాచ్ ఏ సమయానికి ఆరంభమవుతుందో? ఎక్కడ చూడొచ్చో? ఇక్కడ తెలుసుకోండి.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ పోరు ఆదివారం (మార్చి 9) మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు టాస్ వేస్తారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ కు వెళ్లేందుకు నిరాకరించిన భారత్.. తన మ్యాచ్ లన్నింటినీ దుబాయ్ లోనే ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ పోరు స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెళ్లలో చూడొచ్చు.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కు జియోహాట్ స్టార్ వేదిక.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ అజేయంగా ఫైనల్ చేరింది. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. గ్రూప్ దశలో వరుసగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ పై గెలిచింది. సెమీస్ లో ఆస్ట్రేలియా గండాన్ని రోహిత్ సేన దాటింది. ఇప్పుడు తుదిపోరులో ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది.
మరోవైపు న్యూజిలాండ్ ఆడిన 4 మ్యాచ్ ల్లో మూడు గెలిచింది. గ్రూప్ దశలో వరుసగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ పై విజయాలు సాధించింది. చివరి గ్రూప్ పోరులో ఇండియా చేతిలో ఓటమి పాలైంది. సెమీస్ లో దక్షిణాఫ్రికాపై కివీస్ నెగ్గింది.
సంబంధిత కథనం