ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కోసం రెండు బలమైన జట్ల మధ్య మహా పోరు జరగబోతోంది. రేపు (మార్చి 9) ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడున్నాయి. మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో రోహిత్ సేన ఉంది. రెండో సారి ఈ టోర్నీలో ఛాంపియన్ గా నిలవాలని న్యూజిలాండ్ చూస్తోంది. ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు అభిమానులకు కిక్ ఇవ్వడం ఖాయం.
వన్డేల్లో న్యూజిలాండ్ పై భారత్ దే ఆధిపత్యం. ఈ రెండు జట్లు ఇప్పటివరకూ వన్డేల్లో 119 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. మెన్ ఇన్ బ్లూ అయిన భారత్ 61 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. కివీస్ పై దూకుడు ప్రదర్శిస్తోంది. మరోవైపు బ్లాక్ క్యాప్స్ అయిన కివీస్ 50 మ్యాచ్ ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. మిగతా ఏడు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. గత 10 మ్యాచ్ ల్లో న్యూజిలాండ్ పై భారత్ 6-4తో ఆధిక్యంలో ఉంది.
ఐసీసీ టోర్నీల్లో చూసుకుంటే భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైట్ హోరాహోరీగా సాగుతోంది. ఐసీసీ ఈవెంట్లలో రెండు జట్లూ ఈక్వెల్ గా ఉన్నాయి. అన్ని ప్రపంచకప్ లు కలిపి చూస్తే ఈ రెండు జట్లు 10 సార్లు తలపడ్డాయి. రెండు జట్లు చెరో అయిదు మ్యాచ్ ల చొప్పున గెలిచాయి. రెండు జట్లు సమానంగా నిలిచాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకుంటే కూడా రెండు జట్ల మధ్య పోరు ఈక్వెల్ గానే ఉంది. ఇప్పటివరకూ ఈ టోర్నీలో కివీస్, భారత్ రెండు మ్యాచ్ లాడాయి. చెరో మ్యాచ్ లో విజేతగా నిలిచాయి. చివరగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను రోహిత్ సేన చిత్తుచేసింది.
2023 వన్డే ప్రపంచకప్ సెమీస్ లో కివీస్ పై భారత్ గెలిచింది. కానీ అంతకుముందు 2019 ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓడింది. ఆ మ్యాచ్ లో ధోని రనౌట్ భారత అభిమానుల గుండెలను బద్దలుచేసింది. ఆ మ్యాచ్ తర్వాత ధోని మరో వన్డే ఆడలేదు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ భారత్ ను న్యూజిలాండ్ ఓడిచింది.
న్యూజిలాండ్ ఇప్పటివరకూ రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్ టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సార్లు కూడా కివీస్ ప్రత్యర్థి భారత్ కావడం గమనార్హం. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ పై గెలిచిన న్యూజిలాండ్.. ఇండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు దక్కకుండా చేసింది.
సంబంధిత కథనం