ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పై కన్నేసిన న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికాతో సెమీస్ లో భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు సాధించింది. ఈ టోర్నీ చరిత్రలో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. లాహోర్ లో బుధవారం (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్ లో రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 108 పరుగులు), కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102 పరుగులు) సెంచరీలతో సత్తాచాటారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2 వికెట్లు పడగొట్టారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు విల్ యంగ్ (21), రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్ ను మెరుగ్గానే ఆరంభించారు. యాన్సెన్, రబాడ లాంటి సఫారీ పేసర్లను సమర్థంగా ఎదుర్కొనేలా కనిపించారు. కానీ సాఫీగా సాగుతున్న కివీస్ ఇన్నింగ్స్ ను ఎంగిడి దెబ్బకొట్టాడు. విల్ యంగ్ ను ఔట్ చేశాడు. దీంతో కివీస్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది.
విల్ యంగ్ వికెట్ ను పడగొట్టినందుకు సంతోషం కంటే కూడా దక్షిణాఫ్రికాకు బాధే ఎక్కువ మిగిలింది. అందుకు కారణం రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్. ఈ ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా సఫారీ బౌలింగ్ ను ఆటాడుకున్నారు. చక్కటి బ్యాటింగ్ తో మెరిశారు. కివీస్ భారీ స్కోరుకు బాటలు పరిచారు. ఓ వైపు లెఫ్టార్మ్ బ్యాటర్ రచిన్.. మరోవైపు రైటార్మ్ బ్యాటర్ విలియమ్సన్ బౌండరీల వేట కొనసాగించారు.
రచిన్, విలియమ్సన్ సెంచరీల మోత మోగించారు. 101 బంతుల్లో రచిన్ 108 పరుగులు చేశాడు. 13 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. సెంచరీ తర్వాత రచిన్ ఔటైనా.. విలియమ్సన్ దూకుడు కొనసాగించాడు. కేన్ మామ 94 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. 10 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. రచిన్, కేన్ రెండో వికెట్ కు 164 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆఖర్లో టపటపా విలియమ్సన్, టామ్ లేథమ్ (4) వికెట్లు పడగొట్టిన దక్షిణాఫ్రికా.. కివీస్ ను కట్టడి చేసేలా కనిపించింది. కానీ డరిల్ మిచెల్ (49), గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) చెలరేగి జట్టు స్కోరు 360 చేరుకోవడంలో కీ రోల్ ప్లే చేశారు.
సంబంధిత కథనం