టెస్టు క్రికెట్ లో టీమిండియాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించగా.. ఇప్పుడు ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేస్ బౌలర్ బుమ్రా.. తాను ఇంగ్లండ్ తో ఐదు టెస్టులూ ఆడలేనని, మూడు మాత్రమే ఆడగలనని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అటు షమి కూడా అనుమానంగా ఉండటంతో ఇద్దరు కొత్త పేస్ బౌలర్లను సెలెక్టర్లు చూస్తున్నారు.
టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇప్పటికీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. వెన్ను గాయం నుంచి అతడు కోలుకుంటున్నాడు. ఐపీఎల్ మధ్యలో ఎంట్రీ ఇచ్చినా.. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ మొత్తం ఆడే సామర్థ్యం అతనికి ఇంకా రాలేదు.
దీంతో తాను కేవలం మూడు టెస్టులే ఆడగలనని అతడు బీసీసీఐకి చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ వెల్లడించింది. వెన్ను గాయంతో బుమ్రా ఆస్ట్రేలియాతో చివరి టెస్టు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్లో కొన్ని మ్యాచ్ లకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంగ్లండ్ తో మొత్తం ఐదు టెస్టులూ ఆడేంత శక్తి తనకు లేదని అతడు బోర్డుకు చెప్పినట్లు ఆ రిపోర్టు తెలిపింది.
ఇప్పటికే రోహిత్ శర్మ రిటైరవడంతో అతని స్థానంలో టెస్టు కెప్టెన్ ఎవరన్నది తేలలేదు. బుమ్రాకు ఆ అవకాశం దక్కొచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడతడు మొత్తం సిరీస్ కూడా ఆడలేనని చెప్పడంతో కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నట్లే. దీంతో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కు కెప్టెన్సీ దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
అటు మరో స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి కూడా ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. ప్రస్తుతం ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్నా.. టెస్టుల్లో రోజుకు కనీసం 10 ఓవర్లయినా వేసే పరిస్థితుల్లో అతడు ఉన్నాడా అన్నది తెలియడం లేదు. బోర్డుకు కూడా ఇదే సందేహం ఉంది. ఒకవేళ షమి దూరమై.. బుమ్రా కూడా అన్ని టెస్టులూ ఆడలేకపోతే.. ఇద్దరు అదనపు పేస్ బౌలర్లను ఎంపిక చేయాలని చూస్తున్నారు.
అందులో ఒకరు లెఫ్టామ్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్. ఇండియన్ టీమ్ కు ఎలాగూ ఇప్పుడొక లెఫ్టామ్ పేసర్ అవసరం ఉంది. అతడు ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లోనూ బాగా ఆడాడు. దీంతో ఇంగ్లండ్ సిరీస్ కు తొలిసారి అతనికి టెస్ట్ క్రికెట్ నుంచి పిలుపు అందడం ఖాయంగా కనిపిస్తోంది. అతనితోపాటు హర్యానా పేస్ బౌలర్ అన్షుల్ కంబోజ్ కూడా రేసులో ఉన్నాడు. అతడు ఇప్పటికే ఇండియా ఎ టీమ్ లో ఉన్నాడు.
సంబంధిత కథనం