జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో రెండింటికి అందుబాటులో ఉండడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, గత వారం లీడ్స్‌లో ఓటమి పాలైన టీమిండియాకు ఇది నిజంగా పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. హెడింగ్లీలో తేలిపోయిన పేస్ బౌలింగ్ విభాగాన్ని ఎలా బలోపేతం చేయాలో అని తల గోక్కుంటున్న జట్టుకు, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌కు ప్రత్యామ్నాయం కనుగొనడం దాదాపు అసాధ్యమైన పనిలా మారింది.
భారత జట్టు దగ్గర సీమ్ బౌలింగ్ కు బ్యాకప్ పెద్దగా లేదు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ త్రయం తొలి టెస్టులో ఆడారు. లీడ్స్‌లో వాళ్ళు అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో భారత్‌కు కేవలం రెండు ప్రత్యామ్నాయాలే మిగిలాయి. ఆకాశ్ దీప్ బరిలోకి దిగడం లేదా వైట్‌బాల్ క్రికెట్‌లో రెగ్యులర్‌గా ఆడే అర్ష్‌దీప్ సింగ్ ను ఈ సిరీస్‌లో టెస్ట్ అరంగేట్రం చేయించడం.
మరి ఈ ఇద్దరిలో భారత్ ఎవరిని ఎంపిక చేసుకుంటుంది? గౌతమ్ గంభీర్, శుభమన్ గిల్‌లకు ఇది నిజంగా పెద్ద సవాల్ అనే చెప్పాలి. చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. నిర్ణయం తీసుకునే ముందు భారత్ పరిశీలించే ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
ఆకాశ్ దీప్ తన కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. అది కూడా ఇదే ఇంగ్లండ్ టీమ్‌పై. గతేడాది నాలుగో మ్యాచ్‌లో రాంచీలో అరంగేట్రం చేసిన ఆకాశ్.. కొత్త బాల్ తో ఇంగ్లీష్ యూనిట్‌ను చీల్చి చెండాడాడు. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్‌లను అవుట్ చేయడమే కాకుండా.. ఓలీ పోప్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. ఆ మ్యాచ్‌లో సులభంగా గెలవడానికి మార్గం సుగమం చేసింది ఇదే.
బుమ్రాకు సరైన ప్రత్యామ్నాయాన్ని వెతకడంలో.. ఆకాశ్ దీప్ పేరు ముందుంటుంది. అయితే అతని బౌలింగ్ శైలి ఇంగ్లండ్ లో పెద్దగా రాణించని షమిని గుర్తుకు తెస్తుంది. పైగా అతడు తన తొలి సిరీస్ లో రాణించినట్లుగా తర్వాత రాణించలేదు.
అంతేకాకుండా ఆకాశ్ బౌలింగ్ కొన్నిసార్లు నియంత్రణ కోల్పోయి, పరుగులు ధారాళంగా ఇచ్చే అవకాశం ఉంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో దీనిపై విమర్శలు వచ్చాయి. ఇప్పటికే సిరాజ్, ప్రసిద్ధ్ రూపంలో ఇద్దరు పరుగులు భారీగా ఇచ్చే బౌలర్లు ఉండటంతో ఇప్పుడు వాటిని నియంత్రించే బౌలర్ కావాలి.
అర్ష్‌దీప్‌కు ఇంగ్లండ్‌లో రెడ్ బాల్ క్రికెట్‌లో కొంత అనుభవం ఉంది. గత సంవత్సరం ఐదు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లలో కెంట్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతను 13 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ ప్రపంచంలోనే ఉత్తమ వైట్‌బాల్ బౌలర్లలో ఒకడు. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ విజయంలో భారత్ తరఫున కీలక పాత్ర పోషించాడు. షార్టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అతను ఒకడు.
ఈ బౌలర్‌కు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. అతని ఎడమచేతి వాటం బౌలింగ్ శైలి వాటిలో ఒకటి. భారత్‌కు ఇప్పటికే ముగ్గురు కుడిచేతి వాటం సీమర్లు ఉన్నారు. ప్రత్యామ్నాయ బౌలింగ్ యాంగిల్ ఉండటం వల్ల కనీసం గిల్‌కు తన బౌలర్లు రాణించనప్పుడు వేరే ఆప్షన్ ఉంటుంది.
అర్ష్‌దీప్‌లో అత్యంత ఆశాజనకమైన విషయం ఏమిటంటే, అతను గత సంవత్సర కాలంలో డెవలప్ చేసుకొని, బాగా ఉపయోగించిన బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం. అతనితో బౌలింగ్ దాడి ప్రారంభిస్తే టాప్ ఫామ్ లో ఉన్న ఇంగ్లండ్ బ్యాటర్ డకెట్ కు చెక్ పెట్టొచ్చు.
ఎలా చూసినా బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ ను ఎంపిక చేయడం మంచే చేస్తుందన్న భావన క్రికెట్ పండితులు కూడా వ్యక్తం చేస్తున్నారు. వైట్ బాల్ క్రికెట్ తోపాటు ఇంగ్లండ్ లో ఆడిన అనుభవం కూడా అర్ష్‌దీప్ కు కలిసి రానుంది.
సంబంధిత కథనం