Bumrah ICC Test Ranking: బుమ్రా నయా రికార్డు.. అశ్విన్‌ను వెనక్కి నెట్టి.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్
Bumrah ICC Test Ranking: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అత్యధిక ర్యాంక్ సాధించిన ఇండియన్ ప్లేయర్ గా అశ్విన్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.
Bumrah ICC Test Ranking: బుమ్రా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పేస్ బౌలింగ్ భారాన్ని మోస్తున్నాడు. తన అత్యుత్తమ బౌలింగ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో 904 పాయింట్లతో అశ్విన్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బుమ్రా 907 రేటింగ్ పాయింట్లతో బ్రేక్ చేశాడు.
బుమ్రా నయా రికార్డు
ఐసీసీ బుధవారం (జనవరి 1) లేటెస్ట్ టెస్టు ర్యాంకులను రిలీజ్ చేసింది. ఇందులో టీమిండియా పేస్ బౌలర్ బుమ్రా తన నంబర్ వన్ ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. మెల్‌బోర్న్ టెస్టులోనూ అద్భుతంగా రాణించిన అతడు.. 907 పాయింట్లతో నంబర్ వన్ టెస్టు బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఓవరాల్ గా అతని రేటింగ్ పాయింట్స్ ఆల్ టైమ్ లిస్టులో 17వ స్థానంలో ఉంది. ఈ లిస్టులో ఇంగ్లండ్ మాజీ పేస్ బౌలర్ సిడ్నీ బార్నెస్ 932 పాయింట్లతో టాప్ లో ఉన్నాడు. అతని తర్వాత జార్జ్ లోమాన్ 931, ఇమ్రాన్ ఖాన్ 922, ముత్తయ్య మురళీధరన్ 920 పాయింట్లతో తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నారు.
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులోనూ బుమ్రా 9 వికెట్లు తీశాడు. అటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా తాజా ర్యాంకుల్లో ఒక స్థానం మెరుగుపరచుకొని మూడో ర్యాంకుకు చేరాడు. మెల్‌బోర్న్ టెస్టులో ఆరు వికెట్లు తీయడంతోపాటు బ్యాట్ తోనూ రాణించి.. ఆస్ట్రేలియాకు విజయం సాధించిపెట్టాడతడు. అటు ఆల్ రౌండర్ల జాబితాలోనూ కమిన్స్ మూడో స్థానంలోనే ఉన్నాడు. అటు పాకిస్థాన్ తో బాక్సింగ్ డే టెస్టులో రాణించి ఏడు వికెట్లు తీసిన సౌతాఫ్రికా పేస్ బౌలర్ మార్కో యాన్సెన్ కూడా ఆరు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకులో నిలిచాడు.
బుమ్రా ఫాస్టెస్ట్ 200 వికెట్లు
ఇక ఈ మధ్యే మెల్‌బోర్న్ లో ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా మరో ఘనతను కూడా సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసుకున్న ఇండియన్ పేస్ బౌలర్ గా నిలిచాడు. తన 44వ టెస్టులోనే అతడీ రికార్డు అందుకోవడం విశేషం. ఇంతకుముందు 1983లో కపిల్ దేవ్ తన 50వ టెస్టులో 200 వికెట్ల మైలురాయి అందుకున్నాడు.
అత్యంత వేగంగా 200 వికెట్లు తీసుకున్న ఇండియన్ బౌలర్లలో బుమ్రా.. జడేజాతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ 37 టెస్టుల్లోనే 200 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. ఓవరాల్ గా వరల్డ్ క్రికెట్ లో ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ యాసిర్ షా (33 టెస్టులు) పేరిట ఉండగా.. పేస్ బౌలర్లలో డెన్నిస్ లిల్లీ (38 టెస్టుల్లో) ముందున్నాడు.