Bumrah and Siraj: చరిత్ర సృష్టించిన బుమ్రా, సిరాజ్.. వరల్డ్ కప్‌లో ఇదే తొలిసారి.. శ్రీలంక చెత్త రికార్డు
Bumrah and Siraj: టీమిండియా పేస్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ చరిత్ర సృష్టించారు. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఇద్దరు బౌలర్లు తాము వేసిన తొలి బంతికే వికెట్లు తీసుకున్నారు. అదే సమయంలో శ్రీలంక ఓ చెత్త రికార్డును నమోదు చేసింది.
Bumrah and Siraj: టీమిండియా పేస్ బౌలర్లు సిరాజ్, బుమ్రాను చూస్తేనే వణికిపోతోంది శ్రీలంక. ఆసియా కప్ ఫైనల్లో కేవలం 50 పరుగులకే కుప్పకూలిన ఆ టీమ్.. వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ అలాగే తలవంచింది. 358 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లంక.. తొలి బంతికే వికెట్ కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన బంతితో ఓపెనర్ నిస్సంకను ఔట్ చేశాడు.
ఓ వరల్డ్ కప్ మ్యాచ్ లో ప్రత్యర్థిని తొలి బంతికే ఔట్ చేసిన తొలి ఇండియన్ బౌలర్ గా బుమ్రా నిలిచాడు. ఇదే ఆశ్చర్యం అనుకుంటే.. రెండో ఓవర్లో సిరాజ్ కూడా తాను వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. ఈసారి దిముత్ కరుణరత్నెను సిరాజ్ ఔట్ చేశాడు. అతడు కూడా డకౌటయ్యాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఓ టీమ్ లో ఇద్దరు బౌలర్లు తమ తొలి బంతికే వికెట్ తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ ఇద్దరి ధాటికి లంక బ్యాటర్లు వణికిపోయారు. కొత్త బంతితో వీళ్లు నిప్పులు చెరిగారు. ఆ టీమ్ లో తొలి ఐదుగురు బ్యాటర్లలో ముగ్గురు డకౌట్ కాగా.. మరో ఇద్దరు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశారు. నిస్సంక, కరుణరత్నె, సమరవిక్రమ డకౌట్ అయ్యారు. కుశల్ మెండిస్, అసలంక చెరొక పరుగుతో సరిపెట్టుకున్నారు.
శ్రీలంక చెత్త రికార్డు
శ్రీలంక ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో ఓ టీమ్ తొలి ఐదుగురు బ్యాటర్లు కలిసి కేవలం 2 పరుగులే చేశారు. మెన్స్ క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో తొలి ఐదుగురు బ్యాటర్లు చేసిన అతి తక్కువ పరుగులు ఇవే.
అంతకుముందు టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. రెండో బంతికే కెప్టెన్ రోహిత్ (4) వికెట్ కోల్పోయినా.. తర్వాత గిల్ (92), కోహ్లి (88) రెండో వికెట్ కు ఏకంగా 189 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలు చేస్తారనుకున్నా.. దగ్గరగా వచ్చి ఔటయ్యారు. ఇక చివర్లో శ్రేయస్ అయ్యర్ (56 బంతుల్లోనే 82), జడేజా (24 బంతుల్లో 35) చెలరేగడంతో ఇండియా 8 వికెట్లకు 357 రన్స్ చేసింది.