ఐపీఎల్ హిస్టరీలో క్రేజీ రికార్డు నమోదైంది. 18 ఏళ్ల లీగ్ లో ఎన్నో రికార్డులు చూశాం. కానీ ఇది మాత్రం అన్నింటికంటే భిన్నమైంది. ఐపీఎల్ హిస్టరీలో ఎంతో మంది బ్రదర్స్ ఆడారు. కానీ ఈ బ్రదర్స్ మాత్రం యూనిక్ రికార్డు సెట్ చేశారు. ఐపీఎల్ శతకాలు బాదిన ఫస్ట్ బ్రదర్స్ గా హిస్టరీ క్రియేట్ చేశారు. వాళ్లే షాన్ మార్ష్, మిచెల్ మార్ష్
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ఆడిన షాన్ మార్ష్ అదరగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ పై సెంచరీ బాదాడు. 2017 వరకు ఐపీఎల్ లో ఆడిన షాన్ మార్ష్ 71 మ్యాచ్ ల్లో 2477 పరుగులు సాధించాడు. ఓ సెంచరీ, 20 హాఫ్ సెంచరీలు బాదాడు.
షాన్ మార్ష్ సెంచరీ బాదిన 17 ఏళ్ల తర్వాత అతని తమ్ముడు మిచెల్ మార్ష్ హండ్రెడ్ కొట్టాడు. 2009లో ఐపీఎల్ లో అడుగుపెట్టిన మార్ష్ ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడుతున్నాడు. గురువారం (మే 22) గుజరాత్ టైటాన్స్ పై చెలరేగి సెంచరీ బాదేశాడు. 117 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ లో అడుగుపెట్టిన 16 ఏళ్ల తర్వాత మార్ష్ సెంచరీ చేయడం గమనార్హం.
2008 సీజన్ లో షాన్ మార్ష్ ఓ సెంచరీ, అయిదు హాఫ్ సెంచరీలు చేశాడు. అప్పుడు 616 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సీజన్ లో మిచెల్ మార్ష్ కూడా ఓ సెంచరీ, అయిదు హాఫ్ సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు. 12 మ్యాచ్ ల్లో 560 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా బ్రదర్స్ షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ తండ్రి జెఫ్ మార్ష్ కూడా క్రికెటరే. అతను ఆస్ట్రేలియా తరపున సత్తాచాటాడు. 1985 నుంచి 1992 మధ్య ఆసీస్ కు ఆడిన జెఫ్ మార్ష్.. 50 టెస్టులు, 117 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 2854 పరుగులు, వన్డేల్లో 4357 పరుగులు సాధించాడు. 1987 ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ టీమ్ లో జెఫ్ ఉన్నాడు. 1999లో కోచ్ గా కూడా ప్రపంచకప్ ఖాతాలో వేసుకున్నాడు.
సంబంధిత కథనం