BGT 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాదే ఆధిపత్యం - హయ్యెస్ట్ రన్స్ సచిన్ - కోహ్లి చేసిన సెంచరీలు ఎన్నంటే
BGT 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై టీమిండియా ఆధిపత్యం కనబరుస్తూ వస్తోంది. ఇప్పటివరకు పదహారు సార్లు ఈ సిరీస్ జరగ్గా...10 సార్లు టీమిండియా విజేతగా నిలిచింది. ఆరుసార్లు ఆస్ట్రేలియా ఈ టోర్నీని గెలిచింది.
BGT 2024: ఇండియా ఆస్ట్రేలియా మధ్య మరో ఆసక్తికర సమరం శుక్రవారం నుంచి మొదలుకానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ పెర్త్ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై టీమిండియా ఆధిపథ్యం కొనసాగుతూ వస్తోంది.
1996లో మొదలు...
1996 -97 సీజన్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైంది. టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్...ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ పేరు మీద ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఐసీసీ ప్రారంభించింది. ఈ సిరీస్ నిర్వహించిన తొలి ఏడాది 1-0 తేడాతో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది.
పదిసార్లు టీమిండియా విన్నర్...
ఇప్పటివరకు పదహారు సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగ్గా...టీమిండియా పదిసార్లు విజేతగా నిలవగా...ఆస్ట్రేలియా ఐదుసార్లు టైటిల్ దక్కించుకున్నది. ఓసారి సమంగా ఈ సిరీస్ ముగిసింది. గత నాలుగు ఏడాదిల్లో వరుసగా టీమిండియా విన్నర్‌గా నిలుస్తూ వస్తోంది. ఐదోసారి కప్‌ను గెలుచుకొని రికార్డ్‌ను మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది.
56 మ్యాచ్‌లు...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య 56 మ్యాచ్‌లు జరగ్గా...ఇండియా 24 మ్యాచుల్లో, ఆస్ట్రేలియా 20 మ్యాచుల్లో విజయాన్ని సాధించింది. 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన మ్యాచుల్లో మాత్రం ఇండియా రికార్డ్ పేలవంగా ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై 27 మ్యాచ్‌ల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడింది. ఇందులో ఇందులో 14 మ్యాచుల్లో ఆస్ట్రేలియా విజయాన్ని అందుకోగా...ఏడింటిలో మాత్రమే టీమిండియా గెలిచింది. మరో ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
హయ్యెస్ట్ రన్స్ సచిన్ టెండూల్కర్...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ పేరిట రికార్డ్ ఉంది. 56 ఇన్నింగ్స్‌లలో 3262 రన్స్ చేశాడు సచిన్. రికీ పాటింగ్ (2555 రన్స్), వీవీఎస్ లక్ష్మణ్ (2434 రన్స్) టాప్ త్రీలో ఉన్నారు. 2143 రన్స్‌తో ద్రావిడ్ నాలుగో స్థానంలో నిలవగా...2033 రన్స్‌తో పుజారా ఆరు, 1979 రన్స్‌తో కోహ్లి ఏడో స్థానంలో కొనసాగుతోన్నారు. మరో 458 రన్స్ చేస్తే సచిన్‌ను అధిగమించి కోహ్లి ఫస్ల్ ప్లేస్‌లోకి వస్తాడు.
విరాట్ కోహ్లి...
ఈ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో సచిన్ తొమ్మిది సెంచరీలు సాధించాడు. ఎనిమిది సెంచరీలతో సచిన్ తర్వాత కోహ్లి సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు.
కుంబ్లే...అశ్విన్...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లయాన్ (116 వికెట్లు) రికార్డ్ నెలకొల్పాడు. అశ్విన్ (114 వికెట్లు), కుంబ్లే (111 వికెట్లు), హర్భజన్ సింగ్ (95 వికెట్లు), జడేజా 85 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ బోర్డర్ గవాస్కర్ టోర్నీలో పదిసార్లు కుంబ్లే ఐదు వికెట్ల ప్రదర్శనను చేశాడు.