IND vs AUS 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముంగిట టీమిండియా అభిమానులకి గుడ్ న్యూస్.. కానీ కెప్టెన్‌కి తలనొప్పి-boost for india as shubman gill resumes practice ahead of adelaide pink ball test against australia ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముంగిట టీమిండియా అభిమానులకి గుడ్ న్యూస్.. కానీ కెప్టెన్‌కి తలనొప్పి

IND vs AUS 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముంగిట టీమిండియా అభిమానులకి గుడ్ న్యూస్.. కానీ కెప్టెన్‌కి తలనొప్పి

Galeti Rajendra HT Telugu
Nov 29, 2024 01:54 PM IST

India vs Australia 2nd Test: ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టుకి దూరంగా ఉన్న ఇద్దరు భారత స్టార్ క్రికెటర్లు.. అడిలైడ్ టెస్టులో ఆడబోతున్నారు. అయితే.. బ్యాటింగ్ ఆర్డర్‌లో మాత్రం ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది?

డిసెంబరు 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు
డిసెంబరు 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు (AFP)

India playing 11 for 2nd test vs Australia: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముంగిట టీమిండియా అభిమానులకి ఉత్సాహానిచ్చే వార్త వెలుగులోకి వచ్చింది. పెర్త్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టుకి గాయం కారణంగా దూరమైన యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్ ఫిట్‌నెస్ సాధించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ప్రాక్టీస్ సెషన్స్‌లో శుభమన్ గిల్ సౌకర్యంగా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు.

ఈ ఇద్దరిపై వేటు?

కెప్టెన్ రోహిత్ శర్మ కూడా భారత్ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్లి జట్టుతో చేరాడు. తన భార్య రితిక రెండో బిడ్డకి జన్మనివ్వడంతో.. ఫ్యామిలీతో సమయం గడిపేందుకు పెర్త్ టెస్టుకి రోహిత్ శర్మ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

రోహిత్ శర్మ, శుభమన్ గిల్ రీఎంట్రీ‌తో ఇప్పుడు భారత్ జట్టులో కొత్త తలనొప్పి మొదలైంది. పెర్త్ టెస్టులో ఆడిన జట్టులో నుంచి ఎవరిని పక్కన పెట్టాలి? అనే చర్చ మొదలైంది. శుభమన్ గిల్ స్థానంలో దేవదత్ పడిక్కల్, రోహిత్ శర్మ స్థానంలో ధ్రువ్ జురెల్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ జట్టులోకి తీసుకుంది.

బ్యాటింగ్ ఆర్డర్ ఎలా?

ఈ ఇద్దరూ తొలి టెస్టులో కనీసం చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. దాంతో ఈ ఇద్దరినీ తుది జట్టు నుంచి తప్పించడం లాంఛనంగానే కనిపిస్తోంది. కానీ.. కేఎల్ రాహుల్‌ని తుది జట్టులో కొనసాగిస్తే.. బ్యాటింగ్ ఆర్డర్‌లో కొత్త సమస్యరానుంది.

రోహిత్ శర్మ రీఎంట్రీ తర్వాత యశస్వి జైశ్వాల్‌తో కలిసి అతను అడిలైడ్ టెస్టులో ఓపెనింగ్ చేయడం లాంఛనమే. కానీ.. పెర్త్ టెస్టులో ఓపెనర్‌గా ఆడిన కేఎల్ రాహుల్‌కి ఓపెనర్‌గా విదేశీ గడ్డపై మంచి రికార్డ్ ఉంది. అయితే.. రోహిత్, యశస్విని ఓపెనర్ల బాధ్యతల నుంచి తప్పించలేని పరిస్థితి. అలా అని కేఎల్ రాహుల్‌ని నెం.3లో ఆడించాలనుకుంటే అక్కడ శుభమన్ గిల్‌కి మంచి రికార్డ్‌ ఉంది.

విరాట్ కోహ్లీకి నో ఛేంజ్

నాలుగో స్థానం నుంచి విరాట్ కోహ్లీని కదపలేని పరిస్థితి. దాంతో కేఎల్ రాహుల్‌ను నెం.5లో ఆడించాలి. అప్పుడు రిషబ్ పంత్‌ను ఒక స్థానం వెనక్కి జరపాల్సి ఉంటుంది. అదే జరిగితే. .మళ్లీ లెప్ట్ రైట్ కాంబినేషన్‌తో ఇబ్బంది మొదలవుతుంది. ఎందుకంటే.. నెం.7లో ఆడే వాషింగ్టన్ సుందర్ కూడా లెప్ట్ హ్యాండర్. దాంతో కేఎల్ రాహుల్‌ని నెం.6లో ఆడించాలని సూచనలు వస్తున్నాయి. మ్యాచ్ గమనానికి అనుగుణంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్చే అవకాశాలూ లేకపోలేదు.

భారత్, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌ జట్టు మధ్య రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ కాన్‌బెర్రా వేదికగా నవంబరు 30 (శనివారం) నుంచి జరగనుంది. ఈ మ్యాచ్‌తో అడిలైడ్ తుది జట్టుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకి భారత్ తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి , హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Whats_app_banner