Indian Cricket Team: ఒకే రోజు మూడు చోట్ల ఓడిపోయిన భారత్ జట్టు.. బ్లాక్ డే అంటున్న అభిమానులు
Black day for Indian cricket: భారత క్రికెట్‌లో ఈరోజు బ్లాక్ డే. కేవలం 6 గంటల వ్యవధిలో మూడు భారత జట్లు ఊహించని విధంగా పరాజయాన్ని చవిచూశాయి.
భారత క్రికెట్ అభిమానులు ఆదివారం (డిసెంబర్ 8) వరుసగా మూడు ఓటముల్ని చూడాల్సి వచ్చింది. భారత్ సీనియర్, జూనియర్ మెన్స్ టీమ్‌లతో పాటు ఉమెన్స్ టీమ్ కూడా ఈరోజు మ్యాచ్ ఆడి పరాజయాన్ని చవిచూసింది.
రోహిత్ సేన అవమానకర ఓటమి
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాతో చేతిలో ఈరోజు ఓడిపోగా.. భారత మహిళల జట్టు 122 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఇక అండర్-19 పురుషుల ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో 59 పరుగుల తేడాతో భారత యువ జట్టు ఓడిపోయింది.
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు కేవలం 19 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచగా 3.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఛేదించేసింది.
ఉమెన్స్ టీమ్ బెంబేలు
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఈరోజు వన్డే మ్యాచ్ ఆడిన భారత ఉమెన్స్ టీమ్ 122 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్‌లో జార్జియా వాల్, ఎలిస్ పెర్రీ సెంచరీలు బాదేశారు. దాంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 371 పరుగులు ఆస్ట్రేలియా చేసింది. అనంతరం భారత జట్టు 44.5 ఓవర్లలో 249 పరుగులకే కుప్పకూలింది. రిచా ఘోష్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
చేతులెత్తేసి కుర్ర జట్టు
యూఏఈ వేదికగా జరిగిన అండర్ -19 పురుషుల ఆసియా కప్ ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకి ఆలౌటైంది. అనంతరం ఛేదనలో భారత్ జట్టు 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మహ్మద్ అమన్ (26) టాప్ స్కోరర్ గా నిలిచాడు.