పోలీసుల వార్నింగ్.. అయినా వినని ఆర్సీబీ, ప్రభుత్వం.. అందుకే ఈ విషాదం!-bengaluru stampede rcb and karnataka govt ahead for ipl victory celebrations despite police warning ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  పోలీసుల వార్నింగ్.. అయినా వినని ఆర్సీబీ, ప్రభుత్వం.. అందుకే ఈ విషాదం!

పోలీసుల వార్నింగ్.. అయినా వినని ఆర్సీబీ, ప్రభుత్వం.. అందుకే ఈ విషాదం!

బెంగళూరులో మాటలకు అందని విషాదం జరిగింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తమ ఫేవరెట్ టీమ్ విజయోత్సవ సంబరాలను చూద్దామని వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే విజయోత్సవాలు వద్దని పోలీసులు హెచ్చరించినా వినకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని తెలిసింది.

పోలీసుల హెచ్చరికను పట్టించుకోని ఆర్సీబీ, ప్రభుత్వం (AFP/AFP/PTI)

బుధవారం (జూన్ 4) జరిగిన ఆర్‌సీబీ ఐపీఎల్ 2025 విజయోత్సవం ఒక విషాదంగా మారింది. ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ గందరగోళం కారణంగా.. తొక్కిసలాట ఏర్పడి 11 మంది మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్‌సీబీ టైటిల్ గెలిచిన 18 గంటలలోనే ఈ ఈవెంట్ జరిగింది. బయట పరిస్థితి అత్యంత దారుణంగా మారినా చిన్నస్వామి స్టేడియం లోపల విన్నింగ్ సెలబ్రేషన్స్ కొనసాగాయి.

పోలీసులు చెప్పినా

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బయట తొక్కిసలాటతో అభిమానులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. విన్నింగ్ సెలబ్రేషన్స్ బుధవారమే వద్దని చెప్పినా ఆర్సీబీ, కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిసింది. తక్షణమే కాకుండా వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు వాయిదా వేయాలని పోలీసులు సూచించారు. కానీ వాళ్ల సలహాను ఎవరూ పట్టించుకోలేదు.

ఆదివారం అని చెప్పినా

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. 18 ఏళ్ల తర్వాత తొలిసారి టైటిల్ సొంతం చేసుకుంది. ఆ టీమ్ కల నెరవేరింది. దీంతో బెంగళూరులో విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆర్సీబీ నిర్ణయించింది. కానీ వెంటనే ప్రోగ్రామ్ వద్దని పోలీసులు చెప్పారు.

‘‘బుధవారం ఏవైనా ఉత్సవాలు జరపడం సరికాదని మంగళవారం రాత్రి నుంచే ప్రభుత్వం, ఆర్‌సీబీ ఫ్రాంచైజీని మేము హెచ్చరించాం. అది సరికాదని, భావోద్వేగాలు తగ్గిన తర్వాత ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని సూచించాం’’ అని ఓ పోలీస్ ఉన్నతాధికారి డెక్కన్ హెరాల్డ్‌తో తెలిపారు.

ర్యాలీ చేయకూడదన్నాం

విధానసౌధ నుంచి స్టార్ట్ చేసి.. బాలేకుంద్రి సర్కిల్, కబ్బన్ రోడ్, ఎంజీ రోడ్, క్వీన్స్ సర్కిల్ దగ్గర ఉన్న చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించాలనే ప్రణాళికను ముందు రూపొందించారు.

“ఏ ర్యాలీనీ చేయకూడదని, ఒకే చోట ప్రోగ్రాం నిర్వహించమని మేము వారితో చెప్పాం. ఆటగాళ్లను స్టేడియంలోకి తీసుకువచ్చి అక్కడే ముగించమని సూచించాం’’ అని ఆ పోలీస్ అధికారి చెప్పారు.

ఫారెన్ ఆటగాళ్లు వెళ్లిపోతారని

పోలీసుల సలహాలను కర్ణాటక ప్రభుత్వం, ఆర్సీబీ పట్టించుకోలేదని తెలిసింది. “ పోలీసుల సూచనలను కర్ణాటక ప్రభుత్వం, ఆర్సీబీ పట్టించుకోలేదు. వాళ్ల వాదన ఏమిటంటే విదేశీ ఆటగాళ్లు ఈ రోజు లేదా రేపు వెళ్లిపోతారని చెప్పారు. అందుకే ప్రోగ్రాం ఇప్పుడే చేయాలన్నారు” అని పోలీస్ అధికారి అన్నారు.

“ప్రభుత్వం ఈ ఈవెంట్ నుంచి ప్రయోజనం పొందాలనుకుంటుంది. ప్రభుత్వం నిరాకరించి ఉంటే, మరో రకమైన గందరగోళం ఏర్పడి ఉండేది” అని ఆయన పేర్కొన్నారు.

పూర్తిగా అలసిపోయారు

మరో పోలీస్ అధికారి మాట్లాడుతూ.. “ఆర్సీబీ గెలవడంతో రాత్రంతా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 5.30 గంటల వరకు పోలీస్ కమిషనర్ నుండి కానిస్టేబుల్స్ వరకు మా సిబ్బంది రోడ్లపై ఉన్నారు. పూర్తిగా అలసిపోయారు. ఇలాంటి ఫ్యాన్ పిచ్చి ఎప్పుడూ చూడలేదు’’ అని వెల్లడించారు.

స్టేడియం గేట్ల దగ్గర కెఎస్‌సీఏ ఉచిత టిక్కెట్లు జారీ చేసిందని, రెండు లక్షలకు పైగా ప్రజలు ప్రదేశం దగ్గర చేరి గందరగోళం సృష్టించారని డెక్కన్ హెరాల్డ్ నివేదిక వెల్లడించింది. వెంటనే పరిస్థితి అదుపు తప్పి, విధానసౌధంలో కార్యక్రమం ప్రారంభం కాకముందే విషాదం జరిగింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం