దాయాది పాకిస్థాన్ ను అన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని భారత్ చూస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ తో పాక్ ఆర్మీ బేస్ లను ధ్వంసం చేసింది ఇండియా. ఇప్పుడు క్రికెట్లోనూ శత్రు దేశాన్ని ఏకాకి చేయాలని నిర్ణయించుకుంది. అందుకే ఆసియా కప్ నుంచి వైదొలగాలని బీసీసీఐ డిసిషన్ తీసుకుంది. ఈ చర్యతో పాకిస్థాన్ క్రికెట్ ఒంటరి అయ్యే అవకాశముంది. ఆసియాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి సపోర్ట్ ఉండదు.
భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే అన్ని టోర్నీల నుంచి వైదొలగాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. పాకిస్థాన్ క్రికెట్ ను ఏకాకిని చేయాలని చూస్తోంది.
వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి, భారత్ ఆతిథ్య దేశంగా సెప్టెంబర్లో జరగనున్న పురుషుల ఆసియా కప్ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు బీసీసీఐ ఇప్పటికే ఏసీసీకి తెలియజేసింది.
ప్రస్తుతం ఏసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మాత్రమే కాకుండా పాక్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న మోహిన్ నఖ్వీ నేతృత్వం వహిస్తున్నారు. ‘‘పాక్ మంత్రి ఆధ్వర్యంలో ఏసీసీ నిర్వహించే టోర్నమెంట్లో భారత జట్టు ఆడదు. ఇదీ దేశ సెంటిమెంటుకు సంబధించిన విషయం. రాబోయే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలగడం గురించి మేము ఏసీసీకి మౌఖికంగా తెలియజేశాం. ఏసీసీ ఫ్యూచర్ టోర్నీలకూ మా సపోర్ట్ ఉండదు. ఈ మేరకు భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. అలాంటి బీసీసీఐ అండ లేకపోతే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏం చేయలేదు. ఈ నేపథ్యంలో ఏసీసీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. ఇక భారత్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ టోర్నమెంట్ పై కూడా బీసీసీఐ చర్య ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి టీమిండియా ఉనికి లేకుండా టోర్నమెంట్ సాధ్యం కాదు. దీంతో మొత్తం ఆసియా కప్ రద్దయ్యే పరిస్థితి ఉంటుంది. లేదా మోసిన్ నఖ్వీని ఛైర్మన్ పదవి నుంచి తప్పించి, పాక్ లేకుండా ఆసియా కప్ ఆడించే ఛాన్స్ ఉంది.
2024లో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ) ఆసియా కప్ మీడియా హక్కుల కోసం 170 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని దక్కించుకుంది. ఒకవేళ టోర్నీ రద్దయితే సోనీ ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించాల్సి ఉంటుంది. ఆసియాకప్ లో భారత్-పాక్ వివాదం తలెత్తడం ఇదే తొలిసారి కాదు. 2023 లో టీమిండియాను పాకిస్థాన్ పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో హైబ్రిడ్ విధానంలో భారత్ తన మ్యాచ్ లను శ్రీలంకలో ఆడింది.
ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఇదే హైబ్రిడ్ మోడల్ ను అవలంబించారు. భారత్ అన్ని మ్యాచ్ లనూ దుబాయ్ లోనే ఆడింది. ఫైనల్ కూడా అక్కడే ఆడి గెలిచింది. దీంతో హోస్ట్ కంట్రీగా పాకిస్థాన్ కు ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడం పీసీబీకి చావుదెబ్బే.
సంబంధిత కథనం